స్థలం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధికారుల నిర్లక్ష్యం
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ నాన్–లేఅవుట్లు, అప్రూవ్డ్ లేఅవుట్ల పేరిట అమాయక ప్రజలను వ్యాపారులు మో సం చేస్తున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నాన్–లేఅవుట్ల మాయాజాలం
వ్యవసాయ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ఫీజులు చెల్లించకుండా నాన్– లేఅవుట్లుగా మారుస్తున్నారు. కంకర, గ్రావెల్ రోడ్లు వేసి, సోషల్ మీడియా ప్రకటనలు, ఏజెంట్ల ద్వారా తక్కువ ధరకే ప్లాట్లు అంటూ అమ్ముతున్నారు. విద్యుత్, డ్రైనేజీ వసతులు ఆ తర్వాత వస్తాయని నమ్మించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన వందలాది ఎకరాల వెంచర్లు ఇప్పటికీ ముళ్లపొదలుగానే మిగిలిపోయాయి. వీటిపై ఉన్నతాధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టడంతో ఇళ్ల నిర్మాణాలు సాగక, వేసిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక బాధితులు అల్లాడుతున్నారు. పంచాయతీల పరిధిలో కూటమి నాయకులు కొందరు నాన్ లేఅవుట్ల పూడిక దగ్గర నుంచి వాటి విక్రయాల వరకూ చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కమీషన్ వసూళ్లు చేస్తూ అవగాహన లేనివారితో స్థలాలు కొనుగోలు చేయిస్తున్నారు.
భీమవరంలో కొత్త రకం దోపిడీ
భీమవరం ప్రాంతంలో అప్రూవ్డ్ లేఅవుట్లలోనూ అక్రమాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం రోడ్లను మున్సిపాలిటీ లేదా పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేయాలి. కానీ వ్యాపారులు రోడ్లతో కలిపి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ప్లాట్‌దారులకు రోడ్డులో సగం స్థలాన్ని కలిపి అమ్ముతూ, సెంట్లలో పావు నుంచి అర సెంట్ వరకు భూమిని లేనిదిగా చూపి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు.
భీమా ఉడా వచ్చినా.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాకు ఇటీవల ప్రభుత్వం భీమా ఉడా (భీమవరం అర్బన్ డెవల్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భీమా ఉడా వచ్చిన తర్వాత అయినా నాన్ లేఅవుట్లు, నిబంధనలు పాటించని అప్రూల్ లేఅవుట్‌లపై చర్యలు తీసుకుని అక్రమ లేఅవుట్లకు అధికారులు బ్రేక్ వేస్తారా లేదా అని వేచి చూడాలి.
నాన్–లేఅవుట్ నష్టాలు: డీటీసీపీ అనుమతులు లేని నాన్–లేఅవుట్లలో ప్లాట్లు కొంటే విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వసతులు లభించవు. అలాగే ఇంటి నిర్మాణ ప్లాన్ అనుమతులు, బ్యాంకు రుణాలు రావు.
అప్రూవ్డ్ లేఅవుట్ పరిశీలన: 40 అడుగుల ప్రధాన రహదారి, 30 అడుగుల వీధి రోడ్లు ఉండి, 10 శాతం స్థలం పార్కులకు, 30 శాతం స్థలం రోడ్లకు కేటాయించాలి.
రోడ్డు, స్థలానికి డబ్బులివ్వకండి: రోడ్డు స్థలాన్ని మినహాయించి కేవలం మీ ప్లాట్ విస్తీర్ణానికి మాత్రమే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ముందస్తు తనిఖీ: ప్లాట్ కొనేముందు ప్లానింగ్ సెక్రటరీ లేదా సబ్–రిజిస్ట్రార్‌ను సంప్రదించాలి. భూమి పూర్వాపరాలను, లింక్ డాక్యుమెంట్లను నిపుణులతో సరిచూసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.
ఫొటో: ఏఐ సృష్టించిన చిత్రం
గ్రామ సచివాలయాల్లో వీఆర్‌ఓ, ప్లానింగ్ సెక్రటరీ, పట్టణాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు అందుబాటులో ఉన్నా ఈ అక్రమాలను అడ్డుకోవడం లేదు. సోషల్ మీడియాలో అక్రమ వెంచర్ల ప్రకటనలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా మౌనం వహిస్తున్నారు. భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (భీమా ఉడా) ఏర్పాటైన నేపథ్యంలోనైనా కలెక్టర్, జేసీలు స్పందించి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.
ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం
నాన్ లేఅవుట్లు, నిబంధనలు పాటించని వైనం
సోషల్ మీడియాలో పెట్టి మరీ నాన్ లేఅవుట్ల విక్రయాలు
ప్రజలను దోచేస్తున్న వ్యాపారులు
పట్టించుకోని జిల్లా యంత్రాంగం


