భీమవరం: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 27న రాజమహేంద్రవరంలో వెన్నుపోటు టీడీపీ వంచనపై నిర్వహించే బీసీ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడే యుగంధర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం బీసీ నియోజకవర్గ కన్వీనర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా బీసీ గర్జన్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం యుగంధర్ మాట్లాడుతూ బీసీలను టీడీపీ, సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ పదవుల్లో వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారన్నారు. వైఎస్ జగన్ పాలనలోనే బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కిందని స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఒక్క పదవీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈనెల 27న రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని వెంకటాద్రి గార్డెన్స్‌లో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ ఆధ్వర్యంలో బీసీ గర్జన సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. వెన్నుపోటు పార్టీ వంచనపై జరిగే భారీ సదస్సుకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. భీమవరం నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ పిల్లి వీరేశ్వరరావు, రాష్ట్ర ఆర్టీఏ కార్యదర్శి బడుగు బాలాజీ, జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు వీరా మల్లికార్జునుడు, నరసాపురం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు పతివాడ మార్కండేయులు, తణుకు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మామిడిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ మామిడిచెట్టు చిట్టిబాబు, జిల్లా అధికార ప్రతినిధి ప్రసాదుల రాము, ఉండి నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ పాల రాధాకృష్ణ, భీమవరం టౌన్ కమిటీ సభ్యుడు పైపూరి సూరిబాబు, వీరవల్లి తులసీపతి, గాతల సందీప్ తదితరులు పాల్గొన్నారు.


