రీ సర్వే పేరుతో ముడుపుల దందా | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే పేరుతో ముడుపుల దందా

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

రీ సర్వే పేరుతో ముడుపుల దందా

సీఏడీ భూముల రికార్డులు మార్చేలా ప్రయత్నాలు

ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు !

భీమవరం: అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించడంతోపాటు సొంత భూయజమానులకు సరిహద్దులను సక్రమంగా గుర్తించడానికి నిర్వహిస్తున్న భూ రీసర్వే కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కాసుల పంట పండిస్తోంది. ప్రధానంగా భీమవరం మండలంలోని కొన్ని గ్రామాల్లో గతంలో పేదలకు పంపిణీ చేసి సర్కారీ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ల్యాండ్‌ (సీఏడీ) భూములకు రీసర్వే పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. మండలంలోని గొల్లవానితిప్ప, అనాకోడేరు, ఎల్‌వీఎల్‌ పురం, లోసరి గూట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగపిండి, లోసరి, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప తదితర గ్రామాల్లో రీసర్వే జరుగుతోంది. భీమవరం మండలంలో 1921 ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సీఏడీ పేరుతో (అసైన్డ్‌ భూములు) పేదలకు పంపిణీ చేశారు. ఈ భూముల్లో కేవలం వరి పండించుకుని జీవనం సాగించాలి. భూముల్లో ఆక్వా సాగు చేయడం లేదా క్రయ, విక్రయాలు, ఇతరులకు బదలాయించడం నిషేధం. అయితే 1980 ప్రాంతంలో సీఏడీ భూముల్లో ఆక్వా సాగు చేపట్టడం, ఇతరులకు బదలాయించడం వంటివి చేయడంతో 1994లో సీఏడీ కార్పొరేషన్‌ను రద్దు చేసి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై పలువురు రైతులు కోర్టు మెట్లెక్కడంతో 2004లో ఆర్హులైన పేదలకు భూములివ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో సుమారు 650 మందికి కొంత భూమిని పంపిణీ చేశారు. అయితే మరి కొందరు పేదలకు సీఏడీ భూములను ఇళ్ల స్థలాలుగా పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ శాఖ సిద్ధం కాగా అప్పటి నుంచి ఈ భూముల వ్యవహారం పెండింగ్‌లో ఉంది.

రీసర్వే పేరుతో వసూళ్లు

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమిని కొందరు విక్రయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రయవిక్రయాలకు అవకాశం లేకపోయినా రిజిస్ట్రేషన్స్‌ జరిగిపోవడం విశేషం. ఇలాంటి భూములకు సంబంధించి కొనుగోలు చేసిన వారి వివరాలను రీసర్వే పేరుతో రికార్డుల్లో చేర్చడానికి, గతంలో పేదల పేరుతో భూములు పొందిన బినామీల నుంచి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అనాకోడేరు, గొల్లవానితిప్ప రెవెన్యూ గ్రామాల్లోనే దాదాపు 3 వేల ఎకరాలకు పైగా ఉన్న భూమి రీసర్వే జరుగుతుండగా అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన భూములను రీసర్వేలో తమ సొంత భూములుగా చూపించే ప్రక్రియలో భాగంగా అధికారులు ముడుపులు దండుకుంటున్నట్టు చెబుతున్నారు. దీనిపై సమగ్రమైన దర్యాప్తు జరిపితే అక్రమ రిజిస్ట్రేషన్స్‌, రీసర్వే ముడుపులు వ్యవహారం బయటపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement