బుట్టాయగూడెం: అరుదైన జంతుజాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అత్యంత క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. అడవికి పులే రాజుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని, వాటి ఉనికిని కనిపెట్టి పులులు తప్పించుకుంటూ తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్‌డాగ్స్, తమకంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందులను ఈ వైల్డ్‌డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి (సాంబార్ డీర్) లాంటి పెద్ద జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వేటాడతాయి. ఈ వైల్డ్‌డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊరకుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉండి, తోకకు కుచ్చుగా వెంట్రుకలు ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి.
పాపికొండల అభయారణ్యంలో 200 వేట కుక్కలు
పాపికొండలు, నాగార్జున సాగర్–శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యాల్లో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉంటుందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్‌లో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200కు పైగా కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని, ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో, ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వైల్డ్‌డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులు, గడ్డి తినే జంతువుల మధ్య సమతుల్యత భూమిపై మొత్తం పర్యావరణ స్థితిని నిర్ణయిస్తుంది. చిరుతపులి, పెద్దపులి, అడవి కుక్కల వంటి మాంసాహార జంతువుల సంఖ్య తగ్గిపోతే, వాటి ఆహార జంతువులైన వివిధ జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవిపందులు, జింకల సంఖ్య ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రణలో ఈ అడవికుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు అంటున్నారు.
పాపికొండల అభయారణ్యంలో
వైల్డ్ డాగ్స్ సంచారం


