అధికారుల అండతో అక్రమ మైనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అధికారుల అండతో అక్రమ మైనింగ్‌

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

నూజివీడు: మైనింగ్‌, రెవెన్యూ అధికారుల అండదండలతోనే తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌, రవాణా జరుగుతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడు నితిన్‌ కృష్ణకు చెందిన బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటులో భాగంగా కొండను చదును చేసే పేరుతో అక్కడ గ్రావెల్‌ను తవ్వి భారీ ఎత్తున బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న చోట కూడా అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరిపి తరలిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే మంత్రి అనుచరులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

విచారణకు రాని రెవెన్యూ అధికారులు

గత నెల 30న జిల్లా కలెక్టర్‌కు, మైనింగ్‌ శాఖ అధికారులకు రైతులు, గ్రామస్తులు కలిసి అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మైనింగ్‌ జరిగే ప్రదేశంలో రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరుపుతారని రైతులకు సమాచారం అందింది. దీంతో రైతులు అక్రమ మైనింగ్‌ జరుగుతున్న కొండ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా మైనింగ్‌ శాఖ ఆర్‌ఐలు కె.వి.రమణ, శ్రీనివాస్‌ ప్రసాద్‌, సర్వేయర్‌ శ్రీనివాసరావు ఆగిరిపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్‌ పి.ఎన్‌.వి.ప్రసాద్‌ ఏలూరులో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, తహసీల్దార్‌ అనుమతి లేకుండా విచారణలో పాల్గొనలేమని, ఆయన కోసం ఎదురుచూస్తున్నామని మైనింగ్‌ శాఖ అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారులు రాకపోవడంతో, మైనింగ్‌ శాఖ అధికారులు కొంతసేపు వేచి చూసి వెనుదిరిగారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమ మైనింగ్‌ చేసే వారితో కుమ్మకై ్క కావాలనే విచారణకు రాలేదని వారు ఆరోపించారు. మంత్రి అనుచరులకు అన్నీ అనుమతులు ఉంటే, మమ్మల్ని చూసి ఎందుకు తవ్వకాలు నిలిపివేస్తారని ప్రశ్నించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అక్రమ తవ్వకాలు చేసిన వారిపై విచారణ జరిపి జరిమానా విధించాలని వారు డిమాండ్‌ చేశారు. అక్రమ తవ్వకాల వల్ల కొండపై కొలువై ఉన్న దుగ్గిరాల బాలరావమ్మ తల్లి ఆలయానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement