విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి గుర్తుతెలియని మృతదేహం లభ్యం చికెన్‌ వ్యర్థాలు తరలిస్తున్న ఆటో స్వాధీనం వృద్ధుడి అదృశ్యంపై ఫిర్యాదు

నూజివీడు: మండలంలోని పల్లెర్లమూడిలో సోమవారం జరిగిన ఘటనలో వ్యక్తి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ జ్యోతిబసు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన పులవర్తి వీరబ్రహ్మం(35) తన ఇంట్లో మోటార్‌ను బిగిస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్‌ ప్రవహించి షాక్‌కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నూజివీడు: మండలంలోని మీర్జాపురానికి చెందిన నల్లగుంట్ల సురేష్‌ (40) ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించగా, విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై జ్యోతిబసు తెలిపిన వివరాల ప్రకారం, సురేష్‌ భార్యతో ఆరేళ్ల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఇంట్లో ఉరివేసుకోగా, గమనించిన స్థానికులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భీమవరం: రాష్ట్ర విద్యా రంగం సమస్యల వలయంలో ఉందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు డిమాండ్‌ చేశారు. భీమవరంలో సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) జిల్లా సమితి సమావేశం, అధ్యక్షురాలు యామిని దేవిశ్రీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వలరాజు మాట్లాడుతూ, పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల వరకు సమస్యలు తాండవిస్తున్నాయని, ఇంటర్‌, పీజీ విద్యార్థులకు ఇప్పటివరకు అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ వసతి గృహాలకు నిధులు కేటాయించకపోవడం, దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్‌, కమాటి, వార్డెన్‌ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సుందర్‌, హేమంత్‌, కౌశిక్‌, అఖిల్‌ పాల్గొన్నారు.

కుక్కునూరు: మండలంలోని అమరవరం శివారులో పాత హైస్కూల్‌కు వెళ్లే దారిలోని ముత్తయ్య పొలంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఎస్సై రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం ఇటీవల గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి ఉండవచ్చని లేదా నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు సుమారు 5 అడుగుల ఎత్తు, నలుపు రంగుతో ఉన్నాడని, ఎరుపు రంగు టీ–షర్టు, నీలం రంగు షార్ట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఏమైనా వివరాలు తెలిస్తే వెంటనే కుక్కునూరు పోలీస్‌ స్టేషన్‌ను గానీ, 7382623699 నంబర్‌ను గానీ సంప్రదించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

భీమడోలు: పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలో చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్న ఓ ట్రక్‌ ఆటోను భీమడోలు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. 100 కేజీల చికెన్‌ వ్యర్థాలను పూడ్చి పాతిపెట్టారు. ఎంఎంపురానికి చెందిన భలే సాంబశివరావు ఆక్వా చెరువులోకి మండలంలోని పలు గ్రామాల్లోని చికెన్‌ దుకాణాల వద్ద చికెన్‌ వ్యర్థాలు కొనుగోలు చేసుకుని తన ట్రక్‌ ఆటోలో తీసుకుని వెళ్లాడు. గ్రామస్తులు ఎంఎంపురం బస్టాండ్‌ వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సాంబశివరావు అదుపులోకి తీసుకున్నారు.

ద్వారకాతిరుమల: మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బెజవాడ రామారావు అనే 85 ఏళ్ల వృద్ధుడు శనివారం అదృశ్యమయ్యాడు. నల్లజర్ల వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి, బయటకు వెళ్లిన రామారావు తిరిగి ఇంటికి చేరుకోలేదు. దాంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద, ఇలా పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో రామారావు పెద్ద కుమారుడు చిన్న ఏసు ఆదివారం ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement