అత్తిలి: వరిసాగులో రైతులు అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలని, దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గి, నాణ్యమైన మంచి దిగుబడులు లభిస్తాయని మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ చెప్పారు. సార్వా సాగులో రైతులు ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని ఆయన సూచించారు.
భూసార పరిరక్షణకు, ఉత్పత్తి కోసం రసాయన ఎరువులతో పాటు సేంద్రియ జీవన ఎరువులను వాడాలి. సేంద్రియ, రసాయన ఎరువులను కలిపి వినియోగించడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పోషకాల లభ్యత పెరుగుతుంది. భూసార పరీక్షా ఫలితాల ప్రకారం నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. సార్వాలో ఎకరాకు సిఫార్సు చేసిన 36:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌ను స్వర్ణ, ఎంటీయూ –1318 రకాలకు తప్ప అన్ని మిగిలిన రకాలకు వేసుకోవచ్చు. స్వర్ణ, ఎంటీయూ 1318 రకాలకు 24:24:24 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ మాత్రమే వేయాలి. నత్రజని వినియోగ సామర్ధ్యం పెంచడానికి 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం సామర్ధ్యం పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు నత్రజని ఎరువుల వాడకం తగ్గించాలి. నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం, పొటాష్ ఎరువులను సరైన మోతాదులో వేయకపోతే చీడపీడల ఉధృతి పెరిగి, తాలు, కంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. పంట నాణ్యత లోపిస్తుంది. ప్రతి రైతు రెండేళ్లకోసారైనా భూసార పరీక్షలు చేయించుకుని ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. అగ్గితెగులు, పొట్టకుళ్లు తెగులు, గోధుమ రంగు మచ్చ తెగులు నివారణకు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి.


