దొరకని పులి ఆచూకీ | - | Sakshi
Sakshi News home page

దొరకని పులి ఆచూకీ

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

దొరకని పులి ఆచూకీ ఉండిలో బాలిక ఆత్మహత్య ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

బుట్టాయగూడెం: అటవీశాఖ అధికారులు వలలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న పెద్ద పులి సోమవారం కూడా తప్పించుకుంది. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం మధ్యలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పులి దాక్కొంది. రేడియో కాలర్‌ ద్వారా సిగ్నల్‌ రాకపోవడంతో అటవీశాఖ అధికారులు పులి సంచరించే ప్రదేశంలో కొద్దిసేపు శబ్దాలు చేస్తూ హడావుడి చేశారు. కొంతసేపటికి బయటకు వచ్చిన పెద్దపులి కాల్వ వెంట సంచరిస్తున్నట్లు గుర్తించారు. పులిని క్షేమంగా బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వారికి చిక్కకుండా అక్కడి నుంచి జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి మీదుగా రౌతుగూడెం రోడ్డు దాటుకుంటూ బుట్టాయగూడెం మండలం బెడదనూరు అటవీప్రాంతంలోకి చేరుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్న సిగ్నల్‌ లభించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బెడదనూరు అటవీ ప్రాంతం నుంచి కొద్దిదూరంలో పూచికపాడు ఉంది. అక్కడి నుంచి మళ్లీ తెలంగాణ ప్రాంతం మొదలవుతుంది. పులి ఈ రాత్రికి ఆ ప్రాంతం దాటితే ఇక తెలంగాణ ప్రాంత అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు.

ఉండి: ఉండిలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై హెచ్‌.మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం ఉండి జెడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్న కడలి తాప్సీ(15) కొద్ది రోజులుగా టైఫాయిడ్‌తో పాటు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. తండ్రి గల్ఫ్‌ వెళ్ళగా తల్లి భీమవరంలోని ఓ కార్పొరేట్‌ దుకాణంలో పని చేస్తుంది. అనారోగ్యం కారణంగా సోమవారం స్కూల్‌కు వెళ్ళలేదు. సాయంత్రం ఇంటి వద్ద అమ్మమ్మతో పాటు బాలిక మాత్రమే ఉంది. సాయంత్రం అమ్మమ్మ బయటకు వెళ్ళడంతో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక కారణాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: దాళ్వాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి జడ్‌. వెంకటేశ్వరరావు కోరారు. ఎల్‌నినో పరిస్థితులపై సోమవారం మండలంలోని కొండ్రుప్రోలు, ఎల్‌.అగ్రహారం, మెట్ట ఉప్పరగూడెం, కుంచనపల్లి రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయానికి రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలతో పాటు నూనె గింజలు, పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలన్నారు. ప్రస్తుతం నువ్వుల పంటకు మంచి గిరాకీ ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement