చింతలపూడి.. నల్ల బంగారం సవ్వడి | - | Sakshi
Sakshi News home page

చింతలపూడి.. నల్ల బంగారం సవ్వడి

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

చింతలపూడి.. నల్ల బంగారం సవ్వడి

చింతలపూడి: చింతలపూడి ప్రాంతం త్వరలోనే దేశంలోనే అతిపెద్ద ఇంధన హబ్‌గా మారబోతోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఇటీవల నిర్వహించిన ఈ–వేలంలో చింతలపూడి, రేచర్ల బొగ్గు గనులను ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ సంస్థ దక్కించుకుంది. శనివారం రిలయన్స్‌ ప్రతినిధుల బృందం చింతలపూడి మండలంలో బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాలను, గతంలో చేసిన సర్వే స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఇక్కడ భూగర్భ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్‌ సన్నాహాలు వేగవంతం చేసింది. 2029 నాటికి ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి వాయు వెలికితీతను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

3,130 మిలియన్‌ టన్నుల బొగ్గు నిఽల్వలు

కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ప్రాంతంలో భూగర్భ బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయి. చింతలపూడి బ్లాక్‌లో 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో 904.94 మిలియన్‌ టన్నుల ఎ–12 రకం బొగ్గు ఉన్నట్టు గుర్తించారు. రేచర్ల బ్లాక్‌లో 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో 2,225.67 మిలియన్‌ టన్నుల ఎ–13 రకం బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తం రెండు బ్లాకుల్లో కలిపి 3,130.61 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు.

అండర్‌గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ అంటే..

ఈ ప్రాంతంలో బొగ్గు పొరలు భూ ఉపరితలానికి 600 మీటర్ల కంటే లోతులో ఉండటం వల్ల మామూలు తవ్వకాల ద్వారా బొగ్గును బయటకు తీయడం అత్యంత ఖరీదైన వ్యవహారం. అందుకే రిలయన్స్‌ సంస్థ అండర్‌ గ్రౌండ్‌ గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) విధానాన్ని ఎంచుకుంది.

సాంకేతికత ఎలా పనిచేస్తుంది?

భూమి లోపలి బొగ్గు పొరల్లోకి డ్రిల్లింగ్‌ ద్వారా పైపులు పంపిస్తారు. పరిమిత ఆక్సిజన్‌, ఆవిరిని పంపి భూమి లోపలే బొగ్గును పాక్షికంగా కాలుస్తారు. దీని వల్ల బొగ్గు వాయువుగా మారుతుంది. ఈ గ్యాస్‌ను పైపుల ద్వారా భూఉపరితలానికి తీసుకొచ్చి విద్యుత్‌ ఉత్పత్తికి, రసాయనాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పద్ధతి వల్ల ఓపెన్‌ కాస్ట్‌ గనుల మాదిరిగా వేలాది ఎకరాలు తవ్వాల్సిన అవసరం ఉండదు. పైన చెట్లు, పొలాలు దెబ్బతినవు. సాంప్రదాయ గనుల్లో జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టాలు ఇందులో ఉండవు. పైగా వేలాది మంది చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

రైతుల్లో తీవ్ర ఆందోళన

ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే చింతలపూడి, రాఘవపురం, ప్రగడవరం, లింగగూడెం, ఎరగ్రుంటపల్లి గ్రామాలతో పాటు తెలంగాణ సరిహద్దులోని సత్తుపల్లి వైపు ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దుల వరకు రిలయన్స్‌ సంస్థ ప్రభావం ఉంటుంది. కేవలం పైప్‌లైన్లు వేయడానికి, డ్రిల్లింగ్‌ రంధ్రాలు చేయడానికి, ప్లాంట్‌ నిర్మాణానికి మాత్రమే భూసేకరణ చేస్తామని చెబుతున్నా, భవిష్యత్తులో ఈ భూసేకరణ ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందోనని స్థానిక రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణ ప్రతికూలతలు

చింతలపూడి ప్రాంతం అత్యంత సారవంతమైన భూములు, సమృద్ధిగా భూగర్భ జలాలు ఉన్న వ్యవసాయ ఆధారితం. యూసీజీ విధానం వల్ల కొన్ని తీవ్రమైన పర్యావరణ ముప్పులు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు:

తాగు, సాగునీరుపై ప్రభావం

భూమి లోపల బొగ్గు కాలినప్పుడు ఫినాల్స్‌, బెంజిన్‌, పాదరసం వంటి ప్రమాదకర రసాయనాలు విడుదలవుతాయి. గ్యాసిఫికేషన్‌ జరిగే ప్రాంతం చుట్టూ ఉన్న మంచినీటి పొరల్లోకి ఇవి కలిస్తే, పరిసర ప్రాంతాల్లోని బావులు, బోరుబావుల నీరు విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. ఇది తాగునీటికే కాక వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోతుంది.

కఠిన నిబంధనలే శరణ్యం

భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడటమే అతిపెద్ద సవాలు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పర్యావరణ అనుమతులను కఠినంగా అమలు చేస్తేనే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. లేకుంటే చింతలపూడి ప్రాంతంలో వ్యవసాయం, తాగునీటి వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీనే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

బొగ్గు నమూనాలు (ఫైల్‌)

చింతలపూడి–రేచర్ల బొగ్గు గనులకు ఈ–వేలం

రిలయన్స్‌ సంస్థ దక్కించుకున్న వైనం

భూగర్భ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

2029 నాటికి పూర్తిస్థాయి ప్లాంట్‌

పొంచి ఉన్న పర్యావరణ ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement