పెనుగొండ : కోడేరులో గోదావరి వరద పరిస్థితిని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదివారం పరిశీలించారు. వరద నీరు భారీగా వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆచంట మండలంలోని అయోధ్యలంక, పెదమల్లంలంక, పుచ్చల్లంక, మర్రి మూలలంకల్లో ఏర్పాట్లు, పరిస్థితిపై ఆరా తీశారు. లంక గ్రామాల్లో గర్భిణులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన
మార్టేరు–కోడేరు రోడ్డులో జరుగుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను కలెక్టర్ పరిశీలించారు. పైప్‌లైన్ పనులతో దెబ్బతిన్న రోడ్లను నాణ్యతతో పునరుద్ధరించాలన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారి ఎ.శ్రీనివాస్, ఆర్డీఓ దాసి రాజు ఉన్నారు.
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్
వీరవాసరం: డీఎస్సీ–2025లో జరిగిన పేపర్ లీకేజీ, అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం నౌడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఎవరూ భయపడేది లేదని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడి్‌డ్ అని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కవురు శ్రీనివాస్ అన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని కేంద్రాలకు తీసుకురాకుండా, వారి ప్రతినిధుల ద్వారా అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దర్శనార్థం ఆ దివారం ఉదయం క్షేత్రానికి విచ్చేసిన ఓ వృద్ధ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గుర య్యాడు. దేవస్థానం సిబ్బంది వెంటనే పీహెచ్‌సీకి తరలించా రు. వివరాలిలా ఉన్నాయి.. తణుకుకు చెందిన కె.సూర్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి క్షేత్రానికి వచ్చారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే దేవస్థానం ఆంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, అక్కడ ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
పోలవరం రూరల్: పోలవరంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. దిగువన స్పిల్‌వే వద్ద 34.550 మీటర్ల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. స్పిల్‌వే నుంచి 14.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. దిగువన వరద ప్రవాహం కొనసాగుతోంది. పట్టిసం శివక్షేత్రం వద్ద మె ట్లను తాకుతూ వరద ప్రవాహిస్తోంది. లాంచీలను తాత్కాలికంగా నిలిపివేశారు.


