తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వానికి రైతులంటే చులకనని అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఏ పంట పండించినా వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులను పలుకరిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందని, లేదంటే వారిని గాలికొదిలేస్తుందన్నారు. ఆక్వా రంగ రైతుల పరిస్థితి ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. సీడ్, ఫీడ్ ధరలు వ్యత్యాసాలకు అనుగుణంగా రైతులకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. గతంలో ఆక్వా రంగంపై ట్యాక్స్ వేస్తే జే ట్యాక్స్ అని విమర్శలు చేసిన కూటమి నాయకులు ప్రస్తుతం వేస్తున్న ట్యాక్సులు సీబీఎన్ ట్యాక్స్, లోకేష్ ట్యాక్స్, పవన్ ట్యాక్సా అని ప్రశ్నించారు. ఆక్వా రైతులు, రైతు సంఘ నాయకులు జగన్‌ను కలిసి కూటమి ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు చెప్పారన్నారు. ఫీడ్, సీడ్ ధరలు తగ్గించాలని లేకపోతే ఆక్వా రైతుల తరఫున రోడ్డు మీదకు వస్తామని, ఉద్యమం చేస్తామని ప్రకటించిన వెంటనే గురువారం చంద్రబాబు ఆక్వా అధికారులతో సమావేశమై ఫీడ్ ధరను తగ్గించారన్నారు. 0.92 నుంచి 0.95 వరకు పెట్టిన పవర్ ఫ్యాక్టర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల బిల్లులోనే ఇది జరగాలని, ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు.
అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం


