ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రైతులు పండించిన పెసర, మినుము పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. కొనుగోలు నిబంధనలతో రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అపరాల రైతులు బుధవారం ఏలూరు శివారు సుంకరివారితోట రైతు సేవా కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొనుగోలు లక్ష్యం పూర్తయిందని గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో అపరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే తగిన దిగుబడులు రాక, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి అపరాల రైతులు నష్టపోయారన్నారు. అపరాల కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతు సేవా కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పంట రోజులు తరబడి ఇక్కడే ఉండిపోవడంతో ఆ పంట కాపలాకు రాత్రి, పగలు ఇక్కడే పడిగాపులు పడాల్సి వస్తోందని అపరాల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్‌తో సంప్రదింపులు జరుపగా పెసర పంటను వెంటనే గోడౌన్‌కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: బాల బాలికలు సురక్షితమైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరుగుతూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ఐటీడిఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద మిషన్ వాత్సల్య పథకంపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలు జరుగుతున్న చట్టాలు, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకంపై గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీలు, వసతిగృహాల్లో పాటించవలసిన భద్రత, రక్షణ వివరాలను ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌లు, ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలలతో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే మిషన్ వాత్సల్య పథకం లక్ష్యాలను చేరుకుని బాలల స్నేహపూర్వక, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ జిల్లా సిబ్బంది యు.బాలస్వామి, రాజేష్, రాజ్‌కుమార్, డీడీ పి.జనార్థన్ రావు, డీవైఈఓ కె.రవిప్రసన్నకుమార్, ఏఎంఓ కె. శిరమయ్య, జీసీడీఓ డి.రాజేశ్వరి, సీఎంఓ ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


