● ద్విచక్ర వాహనంపై ‘సిరిధాన్యాల’ ప్రయాణం
● వ్యాపారంలో లాభం కంటే.. ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట
చింతలపూడి: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఫాస్ట్ ఫుడ్’ కల్చర్ పెరిగిపోయి ప్రజలు అనా రోగ్యం బారిన పడుతుంటే, ఓ యువకుడు మాత్రం ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ తన జీవనోపాధిని వెతుక్కుంటున్నాడు. చిరుధాన్యాల (మిల్లెట్స్) విలువను చాటిచెబుతున్నాడు చింతలపూడి పట్టణానికి చెందిన దేవగురు సత్యనారాయణ.
ఆరోగ్యం.. ఆదాయం.. ఒకే బాటలో..
ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కొరల్రు, అరికెలు, సామలు, ఊదలు, రాగి వంటి మిల్లెట్లతో తయారు చేసిన జావను విక్రయిస్తూ ఒకపక్క కుటుంబాన్ని పోషించుకుంటూనే, మరోపక్క ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా తన ద్విచక్ర వాహనాన్ని ఒక ‘మొబైల్ క్యాంటీన్’లా మార్చుకుని ఊరూరా తిరుగుతూ వీటిని విక్రయిస్తున్నాడు. కేవలం జావ అమ్మి వెళ్లిపోవడం కాకుండా, దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆయన వివరిస్తున్నాడు. మధుమేహం, రక్తపోటు నియంత్రణలో మిల్లెట్లు ఎలా తోడ్పడతాయో వినియోగదారులకు వివరిస్తున్నాడు. ప్రస్తుతం రోజుకు సగటున 40 నుంచి 50 గ్లాసుల జావ విక్రయిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రజలకు రుచిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై లేదు. చిరుధాన్యాల గొప్పతనం గురించి ఇంకా సరైన అవగాహన రావాలి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే, మరిన్ని ప్రాంతాల్లో ఈ ఆరోగ్యకరమైన జావను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానని అంటున్నాడు.
మిల్లెట్ జావ తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు. చిరు ధాన్యాల జావ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రభుత్వం సహాయం అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచన ఉంది.
– దేవగురు సత్యనారాయణ


