భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో పీఎన్‌జీ (పైప్‌డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టరేట్ ఛాంబర్ ఎన్‌ఎండీవై గోదావరి గ్యాస్, సివిల్ సప్లైస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గృహ వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నిరంతర గ్యాస్ సరఫరా అందించేందుకు పీఎన్‌జీ గ్యాస్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించి, పీఎన్‌జీ కనెక్షన్లు పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో మొత్తం 9,902 గ్యాస్ కనెక్షన్లకు పైప్‌లైన్ సదుపాయం సిద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం 63 మంది మాత్రమే వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే పీఎన్‌జీ గ్యాస్ వినియోగం ద్వారా వినియోగదారులకు నెలకు సుమారు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుందని చెప్పారు. ప్రజలు ముందుకు వచ్చి సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్లు పొందాలని సూచించారు. గ్యాస్ కనెక్షన్ల కోసం గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్‌ను ఫోన్ నెంబర్ 94914 24143 ద్వారా సంప్రదించాలన్నారు. అలాగే భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు పట్టణాల్లో పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సమావేశంలో డీఎస్‌ఓ ఎన్.సరోజ, గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.సత్య రాకేష్, భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి యు.మంగపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


