బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల వద్ద ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించిన ఉద్యోగులు తాజాగా ఈ నెల 27న దేశవ్యాప్తం సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 252 జాతీయ బ్యాంకు శాఖల పరిధిలో 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో పూర్తి స్థాయిలో దిగుతున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా అనేక జాతీయ బ్యాంకుల్ని విలీనం చేశారు. దీనిపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ
జాతీయ బ్యాంకుల్లో సుమారు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో పని భారం పెరిగిందని వాపోతున్నారు. వారానికి ఐదు రోజులు పని కల్పిస్తామని భారత బ్యాంకుల అసోసియేషన్‌కు హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని యూనియన్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలని కోరుతూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలో గతంలో 28 రకాల జాతీయ బ్యాంకులు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 25కు తగ్గింది. ఆయా బ్యాంకుల పరిధిలో సుమారు 252 శాఖలు ఉన్నాయి. రోజూ సుమారు రూ.400 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. ఆయా బ్యాంకుల్లో సుమారు 1,500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.


