దార్శనిక నేత అంబేడ్కర్
భీమవరం: నవ భారత రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేడ్కర్ దార్శనికత గల నేతని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భారత లిఖిత రాజ్యాంగ అసలు కాపీని మోషేనురాజు చేతుల మీదుగా ఆవిష్కరించి, అంబేద్కర్ భవనంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక రూపాన్ని పటిష్టంగా చేస్తూ, తరతరాలు స్వేచ్ఛగా బ్రతికేలా రాజ్యాంగ రచన చేశారన్నారు. అంబేడ్కర్ ఎందరో బడుగు బలహీన వర్గాల భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున మొదటి అంతస్తును నరసాపురం ఆర్డీఓ దాసి రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో మేడిది జాన్సన్, ఎం.కరుణాకర్, కాటం స్టాన్లీరాజు, ఎం.జీవిత రాజు, చెల్లెం ఆనంద ప్రకాష్ పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జనవరి 26న రద్దు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జనవరి 29న పెనుమంట్ర ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించేందుకు తలపెట్టిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని పరిపాలన కారణాలు దృష్ట్యా రద్దు చేశామని కలెక్టర్ తెలిపారు.


