జాతర సంబరం
అమ్మవార్లను దర్శించుకున్న లక్షల మంది
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో ఆదివారం నిర్వహించిన గంగానమ్మ జాతరతో ఏలూరు జనసంద్రంగా మారింది. ఏ రోడ్డు చూసినా జనంతో కిక్కిరిసిపోయింది. ఏడేళ్ళకు ఒకసారి వచ్చే జాతర సందర్భంగా నగర ప్రజలు తమ బంధుమిత్రులను ఆహ్వానించడంతో నగరం సంక్రాంతి శోభను మించి సందడిగా మారింది. అమ్మవారి జాతర జరుగుతుండడంతో సంక్రాంతి పండుగ చేసుకోలేకపోయిన ప్రజలు జాతరను అంతకుమించిన వైభవంతో జరుపుకున్నారు. నగరంలోని తూర్పువీధి, దక్షిణపు వీధి, లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, పవర్ పేట ప్రాంతాల్లో అమ్మవార్ల మేడలు ఏర్పాటు చేసి గత మూడు నెలలుగా అమ్మవారి కొలుపులు నిర్వహించారు. ఆదివారం జాతర సందర్భంగా అమ్మవార్లకు మేడల వద్ద ప్రజలు నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయా మేడల వద్దకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించడానికి క్యూలైన్లలోనే గంటల కొద్దీ సమయం వేచి ఉండాల్సి రావడంతో కొంత అసౌకర్యానికి గురయ్యారు.
భక్తుల నైవేద్యాలతో భారీ కుంభాలు
జాతర ముగింపు సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడమే కీలక ఘట్టం కావడంతో నగరంలోని దాదాపు ప్రతి కుటుంబం అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన నైవేద్యాలతో అమ్మవార్ల మేడల వద్ద భారీ స్థాయిలో కుంభాలు ఏర్పడ్డాయి. భక్తులు గారెలు, బూరెలు, చలిమిడి, వడపప్పు, పానకం, పరమాన్నం తదితరాలు సమర్పించగా ఆయా పదార్థాలతో కుంభాలు పెరిగిపోయాయి.
ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాంతో ఇబ్బంది
జాతర సందర్భంగా నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ స్తంభించింది. ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. లక్షలాది మంది జనం ఒకే రోజు నగరంలో సంచరించడం, ద్విచక్రవాహనాలు, కార్లతో అమ్మవార్ల మేడల వద్దకు వెళ్ళడానికి బయటకు రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళడానికి ప్రయత్నించారు. చిన్నచిన్న సందుల్లో సైతం ప్రజలు తమ బంధుమిత్రులకు విందు భోజనాల కోసం టిప్‌టాప్ పందిళ్ళు, భోజనాలు చేయడానికి డైనింగ్ టేబుళ్ళు, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు అటువైపు ఎవరూ రావడానికి వీలు లేకుండా సైడ్ వాల్స్ కట్టేయడంతో ఎటూ వెళ్ళే అవకాశం లేకపోయింది. ఊరంతా చుట్టు తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రధానంగా స్థానిక పాత బస్టాండు వద్ద ఉన్న ఫ్‌లై ఓవర్‌పై వాహనాలు ఎటూ కదలలేక ఉండిపోయాయి. దీంతో పాటు కొత్తపేట, తూర్పువీధి, చాటపర్రు రోడ్డు తదితర ప్రాంతాల్లో సైతం ట్రాఫిక్ జాం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
ఏలూరు.. భక్త జన హోరు
గంగానమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
అమ్మవార్లను దర్శించుకున్న లక్షలాది మంది
మేడల వద్ద భక్తుల నైవేద్యాలతో భారీ కుంభాలు
ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాంతో ఇబ్బంది
నగర ప్రజల ఆహ్వానం మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన బంధుమిత్రులు సైతం అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడల వద్దకు తరలివచ్చారు. దీంతో మేడల ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 2.50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అంచనా. తరాలు మారినా అమ్మవారిపై సడలని నమ్మకంతో నిర్వహించిన జాతర వైభవానికి ఇతర ప్రాంతాల ప్రజలు సైతం పులకించిపోయారు.
జాతర సంబరం
జాతర సంబరం
జాతర సంబరం
జాతర సంబరం


