మళ్లీ రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు

Jan 26 2026 6:51 AM | Updated on Jan 26 2026 6:51 AM

మళ్లీ రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు

మళ్లీ రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు

రూ.లక్షకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ

అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌

భీమవరం(ప్రకాశం చౌక్‌): చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్‌ చార్జీలు భారీగా పెంచి జనం నెత్తిన భారం మోపడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి చార్జీలు పెంచనున్నారు. ఇందుకోసం మార్కెట్‌ విలువ సవరణకు రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుమతులు ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్‌ విలువ పెరగడంతో ఆస్తి విలువను బట్టి 10 శాతం నుంచి 25 శాతం మేరకు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచనున్నట్లు సమాచారం. ఈ మేరకు అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక చార్జీలు పెంచడం ఇది రెండోసారి. గత ఏడాది మార్కెట్‌ విలువ 10 శాతం పెంచడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు 10 శాతం పెరిగాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం మరోసారి మార్కెట్‌ విలువ పెంచి వాటికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచి జనంపై భారం వేయాలని చూస్తోంది. సాధారణంగా ఏడాదికి ఒకసారి అర్బన్‌లో మార్కెట్‌ విలువ పెంచడం, రెండేళ్లకు ఒకసారి గ్రామీణ ప్రాంతాలల్లో ఆస్తుల విలువలు పెంచడం చేస్తారు. కాని చంద్రబాబు ఏడాదిలో రెండుస్లారు ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్‌ చార్జీలు వడ్డిస్తున్నారు.

సామాన్యుడికి చార్జీల భారం

చిన్నపాటి ఆస్తి లేదా ఆస్తులు, భూముల పంపంకాలు చేసుకునే సామాన్యులకు పెంచుతున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ చార్జీలు భారంగా మారనున్నాయి. చంద్రబాబు 2014లో మాదిరిగానే మళ్లీ ధరల బాదుడు చేపట్టి పన్నులు, చార్జీల రూపంలో జనంపై పెను భారం మోపుతున్నారు. మార్కెట్‌ విలువ 10 నుంచి 25 పెరిగితే రిజిస్ట్రేషన్‌ చార్జీలు భారీగా పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడడం ఖాయం.

జిల్లాలో రియల్‌ వ్యాపారానికి దెబ్బ

కూటమి ప్రభుత్వం మార్కెట్‌ వాల్యూ పెంచడంతో భూమి వాల్యూ, రిజిస్ట్రేషన్‌ చార్జీల ధరలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దెబ్బ తగలనుంది. ఇప్పటికే ఒకసారి పెంచిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రియల్‌ వ్యాపారం దెబ్బతింది. మరోసారి పెంచితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రశ్నార్ధకంగా మారుతుంది.

నెలాఖరు వరకూ పెరగనున్న రిజిస్ట్రేషన్లు?

నెలాఖరు వరకూ జిల్లాలో 15 సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయాలల్లో రిజస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి చార్జీలు పెరుగుతాయనే ఆందోళనతో ఉన్న వారు వేగంగా రిజస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. సాధారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 10 నుంచి 20 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఫ్రిబవరి 1 డెడ్‌లైన్‌ కావడంతో సోమవారం నుంచి రోజుకు 20 నుంచి 50 వరకు రిజస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది.

భీమవరం సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయం

జిల్లాలో రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం – 1

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు – 15

మార్కెట్‌ విలువలో10 నుంచి 25 శాతం పెంచే అవకాశం

అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి

రూ.లక్షకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ భారం

కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి పెంచే మార్కెట్‌ విలువను బట్టి రిజిస్ట్రేషన్‌ చార్జీలు 10 నుంచి 25 శాతం వరకు పెరిగితే ప్రతి లక్షకు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు చార్జీల భారం పెరుగుతుంది.

మార్కెట్‌ విలువ పెంపులో భాగంగా జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మార్కెట్‌ విలువ పెంపుదలకు జిల్లా రిజిస్ట్రార్‌ అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. తాడేపల్లిగూడెం 0 నుంచి 15 శాతం, భీమవరం 0 నుంచి 15, పాలకొల్లు 0 నుంచి 10 శాతం, నర్సాపురం 0 నుంచి 10, తణుకు 0 నుంచి 10, ఆకివీడు 0 నుంచి 15, గునుపూడి 0 నుంచి 12, సజ్జాపురం 0 నుంచి 25, ఆచంట 0 నుంచి 16, అత్తిలి 0 నుంచి 15, మొగల్తూరు 0 నుంచి 15, పెనుగొండ 0 నుంచి 20, పెంటపాడు 0 నుంచి 15, ఉండి 0 నుంచి 10, వీరవాసరం 0 నుంచి 20 శాతం మేర పెంపుదల చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 29 లోపు సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తెలియజేయాలని ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement