పనివేళల్లో మూసి ఉన్న సచివాలయం
కొయ్యలగూడెం: యర్రంపేట సచివాలయం–1 కార్యాలయాన్ని బుధవారం వేళకు తీయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ సేవల కోసం ఉదయం 9 గంటల నుంచి ప్రజలు ఎదురుచూశారు. పదకొండు గంటలు దాటినప్పటికీ ఉద్యోగులు ఎవరూ రాకపోవడం, కార్యాలయం తెరవకపోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం సచివాలయం సేవలు అవసరమై ఉండగా సకాలంలో తెరవకపోవడం వలన తాము నష్టపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వాటిని వదులుకుని సచివాలయ సేవలకు వచ్చామని, కానీ పని వేళల్లో కార్యాలయం తెరవకపోవడంతో తాము నష్టపోయామని వాపోయారు. సుమారు సచివాలయంలో పది మంది వరకు ఉద్యోగులు సేవలు అందించాల్సి ఉండగా, ఒక్కరూ కూడా అందుబాటులోకి రాకపోవడం ఏంటని, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


