పారిశుద్ధ్య కార్మికుల ‘శ్రమ’ గోవిందా.! | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికుల ‘శ్రమ’ గోవిందా.!

Jan 22 2026 8:35 AM | Updated on Jan 22 2026 8:35 AM

పారిశుద్ధ్య కార్మికుల ‘శ్రమ’ గోవిందా.!

పారిశుద్ధ్య కార్మికుల ‘శ్రమ’ గోవిందా.!

ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతోంది. నెలరోజులూ పూర్తిగా పనిచేసినా వారికి 26 రోజులకు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. మిగతా రోజుల్లోని శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇదేంటని పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ మేనేజర్‌ను కార్మికులు ప్రశ్నిస్తుంటే, దేవస్థానం అధికారులు ఇలానే బిల్లులు ఇస్తున్నారని చెబుతున్నాడు. ఇంతకు మించి ప్రశ్నిస్తే.. తమను పనిలోంచి ఎక్కడ తీసేస్తారోనన్న భయంతో కార్మికులు కిమ్మనకుండా ఉంటున్నారు. వివరాల్లోకి వెళితే. శ్రీవారి ఆలయంలో పారిశుద్ధ్య, ఇతర (ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, ఏసీ మెకానిక్‌, కార్పెంటర్‌, మేషన్‌) పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (తిరుపతి) సంస్థకు గతేడాది అక్టోబర్‌ 1 న అప్పగించారు. అగ్రిమెంట్‌ ప్రకారం 212 మంది పనిచేయాల్సి ఉంది. అయితే నూతన క్యూ కాంప్లెక్స్‌, కొత్త అనివేటి మండపం, ధర్మ అప్పారాయ నిలయం (120 గదుల సత్రం) పైన నిర్మిస్తున్న సూట్‌ రూమ్‌లు, ఇతర అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం 180 మంది పారిశుద్ధ్య, హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది, సూపర్‌వైజర్లు, మేనేజర్‌తో మాత్రమే పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం ప్రతి నెలా సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ 18 శాతం, టీడీఎస్‌ 2 శాతం, ఇతర ట్యాక్స్‌లను కట్‌ చేసి సుమారు రూ. 34 లక్షలను కాంట్రాక్టర్‌కు అందజేస్తోంది.

శ్రమ దోపిడీ ఇలా..

పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అనారోగ్యం ఇతర కారణాల వల్ల ఎవరైనా సెలవులు పెడితే, వారి స్థానంలో మిగిలిన వారితో ఓవర్‌టైమ్‌ పని చేయిస్తున్నారని, దానికి ఓటీలు చెల్లించడం లేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే నెల రోజులూ పూర్తిగా పనిచేసినా.. నెలకు నాలుగు సెలవులు తీసేసి 26 రోజులకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, మిగిలిన రోజులకు ఓడీలు ఇవ్వడం లేదని అంటున్నారు. నెలలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా, పనిచేసిన రోజులకు పూర్తిగా వేతనాలు చెల్లించకుండా తమ శ్రమను దోచుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా అడిగితే పనిచేస్తే చేయండి.. లేకపోతే పోమ్మని అంటున్నారని కొందరు కార్మికులు వాపోతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో అదనపు సిబ్బందిని నియమించకుండా, తమతోనే అన్ని పనులు చేయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాలను బయటకు చెబితే తమను పనిలోంచి తీసేస్తారన్న భయంతో కుక్కిన పేనులా పడుంటున్నామని అంటున్నారు.

కార్మికశాఖ అధికారులు ఎక్కడా?

క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నా.. సంబంధిత కార్మికశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా కార్మికుల కష్టనష్టాలు, వారి ఆవేదనను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

అధికారుల వివరణ

నెలరోజులూ పూర్తిగా పనిచేసినా కార్మికులకు 26 రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్న విషయం వాస్తవమేనని శానిటేషన్‌ మేనేజర్‌ ప్రవరాక్య వివరణ ఇచ్చారు. దేవస్థానం అధికారులు ఓడీలు, ఓటీలకు బిల్లులు చెల్లించడం లేదని, అదనంగా సిబ్బందిని నియమించనివ్వక పోవడంతో ఉన్న వారితోనే ఎక్కువ సమయం పనులు చేయిస్తున్నామని చెప్పారు.

నిబంధనల ప్రకారమే..

టెండర్‌ నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్‌కు ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నామని పారిశుద్ధ్య విభాగం ఏఈ ఆదిత్య వివరణ ఇచ్చారు. అడిగిన కార్మికులకు సెలవులు ఇచ్చి, మిగిలిన వారితో పనులు చేయించమని మేనేజర్‌కు చెబుతున్నామన్నారు.

నెల పూర్తిగా పనిచేసినా.. 26 రోజులకే వేతనాలు

పర్వదినాల్లో ఓవర్‌ టైమ్‌ డ్యూటీలు

అయినా ఓడీలు, ఓటీలు లేవు

ప్రశ్నిస్తే పని పోతుందని కిమ్మనకుండా ఉంటున్న కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement