ఆర్థిక లావాదేవీలతోనే స్నేహితుడి హత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక లావాదేవీలతోనే స్నేహితుడి హత్య

Jan 22 2026 8:35 AM | Updated on Jan 22 2026 8:35 AM

ఆర్థిక లావాదేవీలతోనే స్నేహితుడి హత్య

ఆర్థిక లావాదేవీలతోనే స్నేహితుడి హత్య

భీమడోలు: ఆర్థిక లావాదేవీల నేపథ్యమే స్నేహితుడి హత్యకు దారితీసింది. సోమవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని బుధవారం భీమడోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ బుధవారం భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. సూరప్పగూడెంకు చెందిన వెజ్జు రమేష్‌(28), కర్రికొండ కుంకుళ్ల శివతులసి శ్రీనివాస్‌ స్నేహితులు. వీరిద్దరూ కలిసి కోకోకోలా కంపెనీ ట్రాన్స్‌ఫోర్ట్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వారిద్దరూ కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో పండుగల నేపథ్యంలో స్నేహితులతో కలిసి వారు మద్యం సేవించారు. ఎలాగైనా రమేష్‌ను అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస్‌ పథకం రచించాడు. ఈనెల 19వ తేదీ సోమవారం రాత్రి తన కారులో ఇనుప రాడ్‌ను వెంటబెట్టుకుని భీమడోలు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ సీలింగ్‌ భూముల సమీపంలో ఉన్న సర్వీసు రోడ్డు వద్ద జనం సంచారం లేని ప్రాంతానికి రమేష్‌ను తీసుకునివెళ్లాడు. మద్యం తాగిన తర్వాత శ్రీనివాస్‌ ఇనుపరాడ్‌తో రమేష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి చంపి పరారయ్యాడు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై రమేష్‌ సోదరుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు సీఐ విల్సన్‌ కేసు నమోదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్‌, ఎస్సై ఎస్‌కే మదీనా బాషా, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. 48 గంటల్లోనే పొలసానిపల్లి బస్టాండ్‌ వద్ద నిందితుడు కర్రి కొండ కుంకుళ్ల శివతులసి శ్రీనివాస్‌ను భీమడోలు సీఐ విల్సన్‌ అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామన్నారు. హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన భీమడోలు హెచ్‌సీలు సూరిశెట్టి శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ జి.ధర్మరాజు, బి.లక్ష్మీనారాయణ, బి.గోపాలకృష్ణలను డీఎస్పీ అభినందించారు.

48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement