‘పోలవరం’ పరిహారం గల్లంతు
● అడ్డగోలుగా ‘నగదు బదిలీ’
● నిర్వాసితుల గగ్గోలు
● అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
వేలేరుపాడు: పోలవరం నిర్వాసితుల జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. నిజమైన నిర్వాసితులకు అందాల్సిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహారం నకిలీ నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తూ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నారు. ఇంటి విలువల పరిహారం (స్టెక్చర్ వాల్యూస్) విషయంలోనూ పలు తప్పులు పదే పదే దొర్లుతున్నాయి. ఒకరికి చెల్లించాల్సిన పరిహారం మరొకరికి చెల్లించడం ఆ తర్వాత రికవరీ ప్రయత్నాలు చేయడంతో నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. పరిహారం కోసం ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా అధికారులు తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు.
లాలయ్య సొమ్ములు మరొకరి ఖాతాలోకి..
వేలేరుపాడు మండలంలోని నడిమిగొయ్యి గ్రామానికి చెందిన కాపుల లాలయ్య శ్రీరాంపురం బ్లాక్‌లో నిర్వాసితుడు. ఎస్‌ఈఎస్ నంబర్ 2/139గా అధికారులు నిర్ధారించగా రూ.6.86 లక్షలు ఆర్‌అండ్‌ఆర్ వ్యక్తిగత ప్యాకేజీ 2017లో మంజూరైంది. అవార్డు కూడా అయ్యింది. అయితే గతేడాది జనవరిలో శ్రీరాంపురం బ్లాక్‌లోని నిర్వాసితులందరికీ పరిహారం అందగా లాలయ్యకు అందలేదు. దీంతో లాలయ్య ఏడాదిగా కేఆర్‌పురం ఐటీడీఏ ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో అప్పల నర్సయ్య అనే వ్యక్తి పేరున ఉన్న బ్యాంకు ఖాతాలో లాలయ్య పరిహారం సొమ్ములు జమైనట్టు అధికారులు తేల్చారు. ఆ తర్వాత అధికారుల సూచన మేరకు లాలయ్య వేరే బ్యాంక్ ఖాతా నంబరు ఇవ్వగా అందులో ఇంటి పరిహారం సొమ్ములు రూ.5.81 లక్షలు మాత్రమే జమయ్యాయి. ఇప్పటికీ వ్యక్తిగత పరిహారం జమకాలేదు.
ఇంటి విలువలు తారుమారు
రేపాకగొమ్ము గ్రామానికి చెందిన ఇద్దరి నిర్వాసితులు పేర్లు ఒకేలా ఉండటంతో ఇంటి విలువల పరిహారం సొమ్ములు తారుమారు అయ్యాయి. కోడూరి పుల్లారావు, తండ్రి వెంకయ్య అవార్డు నం.376కు సంబంధించి ఇంటికి గాను రూ.12,46,840 పరిహారం మంజూరైంది. ఇదే గ్రామంలో అవార్డు నం.158లో కోడూరి పుల్లారావు, తండ్రి రామయ్య పేరున ఇంటికి రూ.1,10,162 మంజూరయ్యాయి. అయితే ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో ఒకరి పరిహారం మరొకరికి జమైంది. అవార్డు నం.376లో ఉన్న పుల్లారావు తక్కువ పరిహారం రావడంపై అధికారులను ఆశ్రయించగా, విషయం బయటపడింది. వీరిద్దరూ సమీప బంధువులు కావడంతో అవార్డు నం.158లో ఉన్నా పుల్లారావు అవార్డు నం.376లో ఉన్న పుల్లారావుకు తిరిగి పరిహారం సొమ్ములు ఇచ్చేందుకు అంగీకరించాడు.


