నూజివీడు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
నూజివీడు: నూజివీడులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మంత్రి కొలుసు పార్థసారథి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. నూజివీడులో బుధవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.25 కోట్లు మంజూరు చేయించి నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మించామన్నారు. దీంతో ఆస్పత్రిలోని పాత బిల్డింగులో వంద పడకలు, నూతన బిల్డింగ్‌లో 200 పడకల సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే ఐసీయూ యూనిట్, ఏడు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సైతం వసతులు, ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏరియా ఆస్పత్రిని 300ల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయించి, ఆ తరువాత జిల్లా ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
పాలకొల్లు సెంట్రల్: స్థానిక కూరగాయల మార్కెట్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి పట్టణానికి చెందిన బంగారు కృష్ణబాబు, నాగరాణి దంపతులు బుధవారం 20 కిలోల వెండి మకర తోరణాన్ని సమర్పించారు. అర్చకులు పూజలు చేసి అలంకరించారు. దాతలను మంత్రి నిమ్మల రామానాయుడు సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, పట్టణ ప్రముఖులు, ఆలయ ఈఓ పులగం వేణుగోపాలరావు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: ఏలూరులో ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఏలూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వన్‌టౌన్ గడియార స్థంబం పక్కవీధిలో ఏపీ 16 ఎఫ్‌ఎల్ 3478 నెంబర్ ఇన్నోవా వాహనం చాలా రోజులుగా రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉంటుంది. బుధవారం ఒక్కసారిగా కారు ఇంజన్‌లో నుంచి మంటలు చెలరేగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కారు ఇంజన్ మంటల్లో దగ్ధమైంది. కారు యజమాని అందుబాటులో లేకపోవటం, పూర్తి సమాచారం లేకపోవటంతో నష్టాన్ని అంచనా వేయలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
పెదపాడు: అనారోగ్యంతో బాధపడత్ను ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలివి. కొత్తూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న పెద్దిబోయిన ధనంజయ కుమారుడు వెంకటరావు (48) ఏలూరులోని ఓ హోటల్‌లో వంటమేస్త్రిగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ మనస్తాపంలో ఉంటున్నాడు. ఈనెల 20వ తేదీన రాత్రి ఇంట్లో భోజనం చేసిన తరువాత అందరూ నిద్రించారు. 21న తెల్లవారు జామున 4.30గంటల సమయంలో వెంకటరావు కనపడకపోవడంతో చుట్టుపక్కల వెదికి చూసే సరికి కాలనీలోని పడమర వైపున ప్లాట్లలో వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా చావుకు ఎవరూ కారకులు కాదని ఉత్తరం రాసి జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. పెదపాడు హెచ్‌సీ కమలాకరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నూజివీడు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి
నూజివీడు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలి


