కదం తొక్కి.. ప్రభుత్వంపై గళమెత్తి..
గర్జించిన అంగన్‌వాడీలు
భీమవరం: సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు గళమెత్తారు. భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో వేతనాల పెంపు తప్పదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అంగన్‌వాడీలకు వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. మాత శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటుచేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల్లో అధిక మంది పేద మహిళలే ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్ధమని గోపిమూర్తి అన్నారు. ఐసీడీఎస్ జిల్లా అధికారి పీడీ, డీఆర్వో వచ్చి ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడి వారి నుంచి విన తిపత్రం స్వీకరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, కోశాధికారి పీవీ ప్రతాప్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్‌రాయ్, ఎం.ఆంజనేయులు, అంగన్‌వాడీల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కల్యాణి, ఎండీ హసీనా, ఉషారాణి, తులసి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


