చలికాలం.. జాగ్రత్తలు ఇలా
అప్రమత్తతతోనే రక్షణ
భీమడోలు: శీతల గాలులు ప్రజలను వణిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి ఉదయం పొద్దుపోయినా చలి పులి ప్రజలను భయపెడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో రోగుల తాకిడి అధికంగా ఉంది. గతం కన్నా ఓపీ పెరగడంతో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, మధుమేహం, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు శీతాకాలం శత్రువే. శరీరం వ్యాధుల బారిన పడేది ఈ సీజన్‌లోనే. ఎప్పుడైనా గుండె నొప్పిగా ఉందని చెప్పినా వెంటనే సమీపంలోని వైద్యులు వద్దకు తీసుకుని వెళ్లాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉదయం, రాత్రి వేళల్లో పిల్లలకు బయటకు వెళ్లనివ్వకుండా చూడాలి.
పెంపుడు జంతువులకు దూరంగా..
ఈ సీజన్‌లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్‌ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్‌రూమ్, వంట గదిలోకి రానివ్వకుండా అదుపు చేయడం మంచిది. పిల్లలు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దరి దాపుల్లోకి కూడా వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
బయట ఆహారం తినొద్దు : వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా ఉండే పకోడి, బుజ్జీలు, బొండాలను విపరీతంగా అరగిస్తుంటాం. ఈ సీజన్‌లో అలాంటి ఆహారపదార్థలకు కొన్ని రోజులు విరామం ఇవ్వాలి. లేనిపక్షంలో ఆరోగ్యానికి చేటును తెస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయాలు, ఆకుకూరలు, ఏ, సీ, కే, విటమిన్లు పుష్కలంగా లభించే పదార్థాలనే తినాలి. బీటా కెనోటిన్, నైట్రస్ వంటివి ఉండే బీట్‌రూట్, క్యారెట్‌లను, నైట్రస్ వంటివి తినాలి. మసాలా ఫుడ్‌కు దూరంగా ఉంటే మేలు.
గోరువెచ్చని నీటితో ఉపశమనం
చల్లదనంతో ఊపిరితిత్తుల్లోని పొరలు అతిగా స్పందిస్తాయి. కూల్‌డ్రింక్స్‌లు, ఫ్రిజ్‌ల్లో పెట్టిన వాటిని తాగడం ప్రమాదకరం. జలుబు, దగ్గు, జ్వరం బారిన పడిన వారు గోరు వెచ్చని నీటిని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే ధూమపానానికి దూరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. వేడి, తాజా ఆహారం తీసుకోవాలి. కూరగాయాలు, పప్పులు మంచివి, నీరు తక్కువ కాకుండా తాగాలి. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. చలిలో పిల్లలను బయటకు తీసుకు వెళ్లవద్దు. పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయాలు ఇవ్వాలి. వయస్సుకు తగిన టీకాలు పూర్తి వేసి ఉండాలి.
శీతాకాలంలో దీర్ఘకాలిక రోగులు, సాధారణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. సరైన నిద్ర, సమయానికి భోజనం అవసరం. చల్లని వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడపకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలి. వేకువ జామున, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలి. ఏమాత్రం ఆనారోగ్యం తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. శ్వాస తీసుకోవడంంలో తీవ్ర ఇబ్బంది, బీపీ, షుగర్ ఎక్కువగా రావడం, మాట తడబడటం, చేతి కాలి బలహీనత, తీవ్ర దగ్గు లేదా జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ యాసం జేఎం సాయి,
జనరల్ మెడిసిన్, సీహెచ్‌సీ, భీమడోలు
చలికాలం.. జాగ్రత్తలు ఇలా


