క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
కలెక్టర్ నాగరాణి
భీమవరం: ఉద్యోగులు తమ విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని శారీరక, మానసిక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గోదావరి క్రీడోత్సవాల్లో భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గతంలో క్రీడా పోటీలు కేవలం రెవిన్యూ, పోలీస్ శాఖల్లో మాత్రమే జరిగేవని నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 3,500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. పోటీలలో క్రికెట్, వాలీబాల్, షటిల్, చదరంగం, క్యారమ్స్, షాట్‌ఫుట్, టెన్నికాయిట్, త్రోబాల్ వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలతో ఉద్యోగులలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పోటీల్లో 35 శాఖలకు చెందిన 3,500 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటున్నారన్నారు. ముందుగా కలెక్టర్ డివిజన్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. డీఆర్‌ఓ బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీవో కె.రామచంద్రారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్.మోహన్‌దాస్, డీపీఓ ఎం.రామనాథరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం


