సందడిగా బాలోత్సవం
భీమవరం: భీమవరంలో నిర్వహిస్తున్న బాలోత్సవం రెండో రోజు శనివారం సందడిగా సాగింది. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడుతూ బాలోత్సవాలు విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయని, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఒకచోట చేరి తమ అభిప్రాయాలు పంచుకోవడం వల్ల వారిలో సమాజం పట్ల అవగాహన, మనుషుల ప్రవర్తన తెలుస్తాయన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని విద్యార్థుల్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడే అన్ని అంశాల్లోనూ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం విద్యార్దులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, పి.సీతారామరాజు, గాతల జేమ్స్, ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


