ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం | - | Sakshi
Sakshi News home page

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం

Dec 15 2025 6:51 AM | Updated on Dec 15 2025 6:51 AM

ధనుర్

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం శుభప్రదం ●

విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసం ఎంతో శుభప్రదమైంది. విష్ణు, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తారు. పెళ్లికాని యు వతులు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేస్తే కోరుకున్న వరుడు దొరుకుతాడని ప్రతీతి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన వారికి అంతా శుభం జరుగుతుంది.

– సుదర్శనం శ్రీనివాసాచార్యులు, ఆగమ పండితుడు

ద్వారకాతిరుమల: శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి సాక్షాత్తు శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతారు. తన అనుభూతిని, భావాలను పాశురం రూపంలో రచించి 30 పాశురాలను విష్ణువుకు అంకితం చేస్తారు. ఆమె భక్తికి ముగ్ధుడైన శ్రీరంగనాథుడు గోదాదేవిని పరిణయమాడతారు. ఈ ఉత్సవాల కోసం జిల్లాలో వైష్ణవ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ధనుర్లగ్న ప్రవేశాన్ని అనుసరించి ఈనెల 16న మధ్యాహ్నం 1.27 గంటలకు ఘంటానాదం (నెలగంట) జరుగుతుంది.

పవిత్ర మాసం

వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవని భగవద్గీత చెబుతోంది. ఈ మాసంలో రంగనాథుడిని గోదాదేవి వరించి, తన భక్తిని చా టుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి ఈ నెలలోనే ప్రవేశిస్తాడు. ఈ 30 రోజుల కాలాన్ని ధనుర్మాసంగా పిలుస్తూ, విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం.

రోజుకో విన్నపం

శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైంది. వ్రత నిర్వహణలో భాగంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5 పాశురాల్లో వ్రత విధానం, 6 నుంచి 15 పాశురాల్లో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16, 17, 18 పాశురాల్లో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26 పాశురాల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాల్లో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదా రంగనాథుల కల్యాణాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు.

నూతన అనివేటి మండపంలో విష్ణుమూర్తి, గోదాదేవి శిల్పాలు

ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన కూడలిలో ధనుర్మాస మండపం

రేపటి నుంచి శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు

17 నుంచి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు

తిరుప్పావై సేవాకాలాలు, గ్రామోత్సవాలు ప్రారంభం

వచ్చేనెల 14న గోదా, రంగనాథుల కల్యాణం

17 నుంచి గ్రామోత్సవాలు

శ్రీవారి ఆలయంలో ఈనెల 16న మధ్యాహ్నం నె లపట్టడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు, జన వరి 14 వరకు సాగుతాయి. నిత్యం ఆలయంలో తిరుప్పావై గానం, ఆండాళ్‌ కోవెల సేవలను నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గోదాదేవికి కుంకుమా ర్చన చేస్తారు. 17 నుంచి రోజూ ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన కూడలిలోని మండపంలో పూజలు చేస్తారు. జనవరి 14న భోగి పండుగ నాడు శ్రీవారి నిత్య కల్యాణంతో పాటు, గోదా రంగనాథు కల్యాణాన్ని అర్చకులు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈనెల రోజులు ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేసి, ఆ సమయంలో తిరుప్పావై సేవను అర్చకులు నిర్వహిస్తారని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడించారు.

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం 1
1/2

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం 2
2/2

ధనుర్మాసం.. ఆధ్యాత్మిక శోభితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement