ఎందుకింత కడుపుమంట?
బాబు తీరుపై డిప్యూటీ సీఎం కొట్టు ఆగ్రహం
పెంటపాడు: ప్రభుత్వ కళాశాలల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందితే చంద్రబాబుకు ఎందుకింత కడుపు మంట అని, చంద్రబాబు ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. 18 నెలల పాటు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు, దుర్మార్గాన్ని ప్రజలు ఎండగట్టాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండగా ప్రతి జిల్లాకూ మెడికల్ కళాశాల వచ్చేలా ఏర్పాటు చేశారని జగన్‌కు పేరు రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కడుపు మంటతో పీపీపీ విధానం పెట్టి పేదలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ నెల 15న భీమవరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులు కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. 18న రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులను అందించే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేసేలా వేల ఎకరాల ప్రభుత్వ భూములు చంద్రబాబు లీజుకు అప్పగించేలా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని, ఇవన్నీ తెలిసినా.. పవన్ కల్యాణ్ చంద్రబాబు చేస్తున్న మోసంపై నోరెత్తకపోవడం విడ్డూరమన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకునేలా గవర్నర్‌కు కోటి సంతకాలు ప్రతులు అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నవారి ఆశలను నెరవేర్చాలని కొట్టు సత్యనారాయణ కోరారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి సంపత్‌కుమార్, కొలుకులూరి ధర్మరాజు, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ 18 నెలల కాలంలో గూడెం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. గూడెం నియెజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ గ్రాంట్ ద్వారా నిధులు మంజూరు చేయించారో ప్రజలకు చెప్పాలన్నారు. తాను ప్రత్తిపాడు రోడ్డుకు రూ.6.90 కోట్లతో టెండర్లు మంజూరు చేయించానని, ప్రత్తిపాడు, విప్పర్రు రోడ్డుతో పాటు, 5 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయిస్తే.. నిధులు తెచ్చానని గొప్పలు చెప్పకోవడం ఎమ్మెల్యే మానుకోవాలన్నారు.


