కాపాడితేనే మనుగడ
జిల్లాలో 2.70 లక్షల పశువులు
40 రకాల మందులు అవసరం
పశువుల ఆస్పత్రుల్లో మందులు లేకపోవడంతో వైద్యు లు ప్రైవేటు దుకాణాలకు మందులు రాస్తున్నారు. గేదెను ఆస్పత్రికి తీసుకువెళితే వందలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. తరచూ పారుడు, అజీర్తి, జ్వరం సమస్యలతో గేదెలను ఆస్పత్రికి తోలుకెళ్తుంటే కనీసం యాంటీ బయోటిక్ మందులు కూడా లేవని, బయట కొనుక్కొని తెచ్చుకోమంటున్నారు. మందులు లేనప్పుడు ఆస్పత్రులు ఎందుకు మూసేయండి. గేదెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు కిరాయిలు దండగని చిన్న డాక్టర్‌ను ఇంటికి పిలిచి వైద్యం చేయించుకుంటున్నాం.
– దొంగ శ్రీను, పాడి రైతు, కొత్తపాడు, ఇరగవరం మండలం
తణుకు అర్బన్ : ప్రభుత్వ పశు వైద్యశాలలను మందుల కొరత వేధిస్తోంది. దీంతో పశువులకు వైద్యం అందించడం తమకు భారంగా మారిందని పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆస్పత్రిలో వైద్యు లు పరీక్షలు చేసినా మందుల కోసం ప్రైవేటు మందుల దుకాణాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా పశు వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం ఏడాదిలో క్వార్టర్‌కు ఓసారి అంటే మూడు నెలలకోసారి మందుల సరఫరా చేయాల్సి ఉండగా ఈ ఏడాది మే నెలలో మాత్రమే మందులు సరఫరా చేసింది. తర్వాత రెండు క్వార్టర్స్ మందులు ఇప్పటికీ సరఫరా కాకపోవడంతో కొరత ఎక్కువగా ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా పశువుల వైద్యంపై సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని వెటర్నరీ హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు, రైతు సేవా కేంద్రాల్లో పశు వైద్య మందులు అందుబాటులో లేవు. ఆస్పత్రులకు వస్తున్న పాడి రైతులకు మందుల్లేవని, బయట నుంచి తెచ్చుకోమని చెప్పలేక వైద్యులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
కనీసం గాజుగుడ్డ, దూది లేదు
చంద్రబాబు సర్కారులో పశు వైద్యశాలకు కనీసం దూది, గాజుగుడ్డ, టించర్, అయోడిన్ వంటి సాధారణ మందులు కూడా సరఫరా చేయడం లేదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. మూగజీవాలను పశువుల ఆస్పత్రికి తీసుకువెళ్లడం కూడా దండగ అని స్థానికంగా ఉండే చిన్నపాటి వైద్యులతో ఇంటి వద్దే వైద్యం చేయిస్తున్నాయి. కనీసం మూగజీవాలకు గాయాలు, పుండ్లు వంటి వాటికి కట్టుకట్టే గాజుగుడ్డ కూడా లేదంటే ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా అర్థమవుతుందని పాడి రైతులు మండిపడుతున్నారు.
సుమారు 40 వేల మంది..
జిల్లాలో పశుపోషణపై ఆధారపడి సుమారు 40 వేల మంది పాడి రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా గేదెలు, ఆవులను పోషిస్తూ పాలు, వెన్న, నెయ్యి విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా పశువులకు చిన్నపాటి అనారోగ్యం వచ్చినా మందులు కొనుగోలు చేయాల్సి రావడం వీరికి భారంగా మారింది. పశుసంపద ద్వారా వచ్చే ఆదాయం పశువుల ఆరోగ్యానికే వెచ్చించాల్సి వస్తుందని వీరు వాపోతున్నారు.
ఇండెంట్ పంపాం
మందుల కొరతపై జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ఆర్.కోటిలింగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా మందుల సరఫరా లేకపోవడం వాస్తవమేనని, మందులకు సంబంధించిన ఇండెంట్ ఉన్నతాధికారులకు పంపించామని, నెలాఖరుకు రావచ్చని చెప్పారు.
దూదికీ దిక్కులేదు
పశువుల ఆస్పత్రుల్లో మందుల కొరత
రెండు త్రైమాసికాలుగా నిలిచిన మందుల సరఫరా
గతంలో ఎన్నడూ ఇలా లేదంటున్న రైతులు
జిల్లాలో 2.70 లక్షల పశువులు
జిల్లాలో పశువులు (2019 లెక్కల ప్రకారం)
గేదెలు 1,76,957
ఆవులు 45267
మేకలు 38,662
గొర్రెలు 22,921
జిల్లాలో 2019 లెక్కల ప్రకారం గేదెలు, ఆవులు కలిపి 2,22,224, మేకలు, గొర్రెలు కలిపి 61,583 ఉన్నాయి. 2019 తర్వాత పశుగణన పూర్తయినా అధికారిక గణాంకాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే తాజాగా పశువుల సంఖ్య తగ్గిందని, జిల్లాలో గేదెలు, ఆవులు కలిపి సుమారుగా 2 లక్షలు ఉండగా మేకలు, గొర్రెలు కలిపి 70 వేలు వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
పశు వైద్యశాలల్లో సుమారు 40 రకాల మందులు అందుబాటులో ఉండాలి. పశువులకు సాధారణంగా అజీర్తి, పారుడు వ్యాధి, జ్వరం, పొదుపు వాపు జబ్బు, గర్భకోశ వ్యాధులు వంటివి తరచూ వస్తుంటాయి. వీటి కోసం యాంటీ బయోటిక్స్‌తోపాటు ఇతర మందులు ఉండాలి. అయితే ఇవేమీ లేకపోవడంతో వైద్య పరీక్షల అనంతరం పాడి రైతులు బయట దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా దూడ పుట్టిన వెంటనే పాముల మందు మొదటి వారంలో ఒక డోసు ఆపై 6 నెలలపాటు నెలకు ఒక డోసు చొప్పున వేయాలి. గేదెలకు 6 నెలలకోసారి ఈ మందు వేయాల్సి ఉంటుంది. కనీసం ఇవి కూడా ఆస్పత్రుల్లో లేకపోవడంతో ప్రైవేటు మందులే దిక్కయ్యాయి.
కాపాడితేనే మనుగడ
కాపాడితేనే మనుగడ


