కుట్రలను అడ్డుకునేలా ప్రజా ఉద్యమం
తాడేపల్లిగూడెం అర్బన్: కూటమి ప్రభుత్వ అరాచకాలను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం చేపట్టిందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. పట్టణంలోని కొట్టు క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ పేదలకు వైద్యం వేగవంతంగా అందించాలనే ఆలోచనతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చి ఐదు నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధంగా, 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు బేరసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దోచుకోవడానికి అన్నట్లు అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో 85 వేల బెల్టుషాపులు నిర్వహిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నోరు మెదపడం లేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే పారితోషకాలతో కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడానికి ధైర్యం సరిపోవడం లేదా అని ప్రశ్నించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఈనెల 12న వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పథకాలకు తూట్లు
పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే భయంతో జగన్ పేరును జపం చేయడం కూటమి శ్రేణులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముప్పడి సంపత్‌కుమార్, మోషే, సిర్రాపు శాంతకుమార్, కనుపూరి భాస్కర్, కట్టా నాగరాజు, అరిగెల అభిషేక్, గుండుమోగుల సాంబయ్య, తగరంపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ


