పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామిని ప్రత్యేకంగా కార్తీక మాసం సందర్భంగా శనివారం భక్తులు, పంచారామ యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఉదయం నుంచి భక్తులు, అయ్యప్ప మాలధారులు స్వామికి మహన్యాస పూర్వక అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అలంకరణను తిలకించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రాము, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోలవరం రూరల్: రెండో శనివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పట్టిసం శివక్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. క్షేత్రం వద్ద కుటుంబసభ్యులతో గడిపారు. దైవదర్శనంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా క్షేత్రం అభివృద్ధి చెందింది. అయ్యప్ప, భవానీ మాలాధారణ స్వాములు స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం: కార్తీకమాసం శనివారం కావడంతో గుర్వాయిగూడెం మద్ది శ్రీ అంజనేయస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆధ్వర్యంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతఅభిషేకం నిర్వహించారు. కొత్తపేట శ్రీ శారదా కళాక్షేత్రం కళాశాల చిన్నారులచే కూచిపూడి నృత్యం నిర్వహించారు. ఆలయానికి సాయంత్రం 4 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ. 4,12,520 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి భక్తులతో కిటకిటలాడింది. సుప్రభాత సేవ మొదలుకుని తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి తదితర పూజా కార్యక్రమాలతో పాటు, స్వామిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయానికి పూజ టిక్కెట్, ప్రసాదాలు, విరాళాలు ద్వారా రూ. 2.49 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.
పెనుగొండ: చేతి కంది వస్తున్న పంట కాస్తా తుపానుకు దెబ్బతినడం, ఇటీవలే తల్లి మృతి చెందడంతో తీవ్ర వ్యథకు గురై కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆచంట మండలం ఆచంట వేమవరం వైఎస్సార్ కాలనీకి చెందిన బొర్రా నాగరాజు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల తుపానుకు వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. తల్లి మరణించి బాధలో ఉన్న నాగరాజుకు, వ్యవసాయం సైతం దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. బంధువులు హుటాహుటిన పాలకొల్లు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. సోదరుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి
ప్రత్యేక అలంకరణలో క్షీరారామలింగేశ్వరస్వామి


