రైతు రక్షణ కోసం ఉద్యమించాలి
జంగారెడ్డిగూడెం: వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం ఉద్యమాలు సాగించాలని, పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ హాలులో రైతు సంఘం ఏలూరు జిల్లా 23వ మహాసభ నిర్వహించారు. అధ్యక్ష వర్గంగా జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మహిళ రైతు నాయకురాలు గంగుల రమణ వ్యవహరించారు. రైతు సంఘం జెండాను గుత్తికొండ వెంకటకృష్ణారావు ఆవిష్కరించారు. వి.కృష్ణయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. వ్యవసాయ కార్పొరేటీరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ గత మూడు సంవత్సరాల కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. గత మూడేళ్లలో ధాన్యం, కోకో, కొబ్బరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, అపరాలు, ఆక్వా, పాడి తదితర పంటల సమస్యలపై అనేక ఉద్యమాలు సాధించామని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పి.సూర్యారావు, కెవీపీఎస్ కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకరణ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య, కోర్స జలపాలు, సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


