అలంకారప్రాయంగా మండపాలు
పట్టించుకునేదెవ రు?
● శ్రీవారి క్షేత్రంలో లక్షలాది రూపాయలతో నిర్మాణం
● నేటికీ ప్రారంభానికి నోచుకోని వైనం
ద్వారకాతిరుమల: క్షేత్రంలో ఆచార సంప్రదాయాలను పరిరక్షించేందుకు శ్రీవారి దేవస్థానం అధికారులు ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో పునః నిర్మించిన ధనుర్మాస, శివ మండపాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాంతో అవి అలంకార ప్రాయంగా మారాయి. శ్రీవారు, అలాగే క్షేత్రపాలకుడు శివయ్య ఆ మండపాల్లో ఎప్పుడు కొలువుదీరతారా అని భక్తులు, స్థానికులు వేయి కళ్లతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో విలాస, ఉగాది, దసరా, ధనుర్మాస, శివ మండపాలు ఉన్నాయి. వాటిలో ధనుర్మాస మండపం 22 ఏళ్ల క్రితం, శివ మండపం 30 ఏళ్ల క్రితం శిథిలమయ్యాయి. దాంతో స్వామివారికి ధనుర్మాస ఉత్సవాన్ని ఆలయ ప్రధాన కూడలిలోని విలాస మండపంలో నిర్వహిస్తున్నారు. పూర్వ ఆచార సంప్రదాయలను కొనసాగించేందుకు దేవస్థానం అధికారులు ఈ రెండు మండపాలను ఏడేళ్ల క్రితమే పునః నిర్మించారు. వాటిని ప్రారంభించడం మరచిపోయారు. ఫలితంగా ఆ మండపాలు స్వామివార్ల సేవలకు దూరంగా ఉన్నాయి.
మండపాల ప్రాముఖ్యత..
ధనుర్మాసం నెలరోజులు ఉభయ దేవేరులతో శ్రీవారు నిత్యం ఉదయం వేళ క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగుతారు. ఆ సమయంలో స్వామి, అమ్మవార్లను అర్చకులు ధనుర్మాస మండపంలో ఉంచి పూజాధికాలను జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేస్తారు. ధనుర్మాస మండపాన్ని పునః నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ విలాస మండపంలోనే ఆ ఉత్సవాలను నిర్వహిస్తుండటం శోచనీయం. ప్రతి ఏటా శివరాత్రి రోజున శివ మండపంలో క్షేత్రపాలకుడైన (శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి) శివయ్యకు కల్యాణాన్ని నిర్వహించేవారు. పాత మండపం శిథిలం కావడంతో 30 ఏళ్లుగా ఆ కల్యాణాన్ని ఆలయ మండపంలోనే జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సుమారు 8 ఏళ్ల క్రితం అప్పటి ఆలయ ఈఓ విష్ణుప్రసాద్ ప్రతి నెలా మాస శివరాత్రి రోజున గ్రామోత్సవానికి వచ్చిన శివయ్యకు ఈ మండపంలో పూజలు చేయించి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందేలా చూశారు. ఇదే తరహాలో శివ కల్యాణాన్ని కూడా ఈ మండపంలో జరపాలని అధికారులు భావించారు. అందులో భాగంగానే శిథిలమైన శివ మండపాన్ని తొలగించి, ఏడేళ్ల క్రితం మళ్లీ పునః నిర్మించారు. కానీ ఈ రెండు మండపాలు ప్రారంభానికి నోచుకోలేదు.
క్షేత్రంలోని పసరుకోనేరు వద్ద అలంకార ప్రాయంగా ఉన్న ధనుర్మాస మండపం, శివ మండపం పక్క నుంచే వెళ్తున్న గంగా, పార్వతీ సమేత శివదేవుడి వాహనం(ఫైల్)
మండపాలకు శిఖర ప్రతిష్ఠ చేసి ఉత్సవాలను పునః ప్రారంభించాలి. అధికారులెవరూ వీటిని పట్టించుకోవడం లేదు. వీటిని మరచిపోయారని అనుకోడడానికి లేదు. ఎందుకంటే లక్షలాది రూపాయలతో నిర్మించిన ఈ మండపాలకు, ప్రతి ఏటా వేలాది రూపాయలతో రంగులు వేయించి ముస్తాబు చేస్తున్నారు. ఇలా మండపాలను అలంకార ప్రాయంగా ఉంచడం వల్ల ఉపయోగం ఏమిటని స్థానికులు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. వచ్చేనెల 16 నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసంలోనైనా ఈ ధనుర్మాస మండపాన్ని వాడుకలోకి తేవాలని భక్తులు కోరుతున్నారు. అలాగే వచ్చే శివరాత్రికి శివ మండపాన్ని అందుబాటులోకి తేవాలని అంటున్నారు. అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అలంకారప్రాయంగా మండపాలు


