చిన్నారిపై పిచ్చి కుక్క దాడి
ద్వారకాతిరుమల: రెండేళ్ల వయస్సున్న చిన్నారిపై శనివారం ఉదయం పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటన మండలంలోని గొల్లగూడెంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నూరి జాన్సీరాణి తన రెండేళ్ల కొడుకు యువరాజ్‌ను ఇంటి ముందు ఉన్న వీధి రోడ్డుపై ఆడుకునేందుకు విడిచిపెట్టింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక పిచ్చికుక్క చిన్నారిపై దాడి చేసింది. ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది. స్థానికులు ఆ శునకాన్ని అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయింది. చిన్నారి బుగ్గపై తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన భీమడోలు ప్రభుత్వాస్పత్రికి తరలించి, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించారు. రోజురోజుకు వీధి కుక్కల బెడద ఎక్కువ అవుతోందని, తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


