కాపర్ వై ర్ల చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని దొరసానిపాడు గ్రామంలో ఇద్దరు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి, అందులోని కాపర్ వైర్లను చోరీ చేశారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మద్దిపాటి చిన్నకొండలరావు, చిలుకూరి హరిబాబులు రోజులానే వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నారు. తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు తమ పొలాలకు వెళ్లారు. పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, వాటి పరికరాలు కింద చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని చూశారు. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి, అందులోని కాపర్ వైర్లను చోరీ చేసినట్టు గుర్తించారు. వెంటనే విద్యుత్ శాఖ ఏఈకి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో, వ్యవసాయ భూముల్లో జరుగుతున్న కాపరు వైర్ల చోరీలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.


