పంచదారకు కోత
మూణ్ణాళ్ల ముచ్చటగా కందిపప్పు
తుపాను పేరిట కోత
సాక్షి, భీమవరం: కూటమి పాలనలో పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇప్పటికే కందిపప్పు పంపిణీ నిలిచిపోగా తాజాగా ఈ నెలలో చక్కెరకు కోత పడింది. చాలామంది కార్డుదారులకు కేవలం బియ్యం పంపిణీతో సరిపెట్టారు. చక్కెర కోసం అడిగితే డీలర్లు రాలేదని సమాధానమిస్తున్నారని వినియోగదారులు అంటున్నారు.
1,052 షాపులు.. 5.58 లక్షల కార్డులు
జిల్లాలోని 1,052 రేషన్ డిపోల పరిధిలో 5,58,019 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో సుమారు 31,844 అంత్యోదయ కార్డుదారులు ఉన్నారు. అంత్యోదయ లబ్ధిదారులకు 35 కిలోల బియ్యం, పంచదార అర కిలో రూ.13.50లు చొప్పున కిలో పంచదార పంపిణీ చేసేవారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.17లకు అర కిలో పంచదార, కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. గతంలో 356 ఎండీయూ వాహనాల ద్వారా వినియోగదారుల చెంతకే సరుకులు పంపిణీ జరిగేది. తూకంలో కచ్చితత్వం, ఈ–పోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి సరుకుల అక్రమ రవాణాకు ప్రభుత్వం తెరదించింది.
చక్కెర రాలేదు
నవంబరు నెలకు చక్కెర సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని మొత్తం కార్డుదారులకు దాదాపు 294 టన్నుల పంచదార అవసరమవుతుంది. తుపాను బాధితుల పేరిట సగానికి పైగా రేషన్ షాపులకు పంచదార సరఫరా చేయలేదని తెలుస్తోంది. అరకొరగా స్టాకు వచ్చిన మేర ముందుగా వచ్చిన కార్డుదారులకు పంచదార పంపిణీ చేసి మిగిలిన వారికి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. పంచదార కోసం డీలర్లను అడుగుతుంటే తుపాను బాధితులకు పంపేసినట్టుగా చెబుతున్నారని వినియోగదారులు అంటున్నారు. బయట మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.150లు, పంచదార రూ.50లు ఉండటంతో అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
గతేడాది అక్టోబరులో కందిపప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. ఫిబ్రవరిలో అంతంతమాత్రంగా సరఫరా చేసి మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దంటూ సివిల్ సప్లయీస్ అధికారులు ముందుగానే డీలర్లకు సమాచారం ఇస్తున్నారు. వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉన్న ఎండీయూ వాహనాలను నిలిపివేయడంతో పాతరోజుల్లో మాదిరి సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద వినియోగదారులు పడిగాపు లు కాయాల్సి వ స్తోంది. దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికే బియ్యం అందజేస్తున్నట్టు ప్రకటించుకుంటున్నా క్షేత్రస్థాయిలో సరిగా అమలుకావడం లేదు.
పేదలకు వాత
రేషన్ షాపుల్లో కార్డుదారులకు అందని చక్కెర
ఇప్పటికే నిలిచిన కందిపప్పు పంపిణీ
తాజాగా తుపాను బాధితుల పేరిట పంచదారకు ఎగనామం
బియ్యం పంపిణీతో సరిపెడుతున్న సర్కారు
వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్న డీలర్లు
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్య్సకార, చేనేత కుటుంబాలకు 50 కిలోలు, మిగిలిన వారికి 25 కిలోల బియ్యం, ఒక కిలో పంచదార, ఒక కిలో బంగాళాదుంపలు, ఒక కేజీ ఉల్లిపా యలు, ఒక లీటరు ఆయిల్‌తో కూడిన కిట్లను జిల్లాలోని దాదాపు 30,112 కుటుంబాలకు అందజేసినట్టుగా సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు 30 టన్నుల పంచదార పంపిణీ చేసినట్టు అంచనా. మోంథా తుపానుపై సర్వం సిద్ధంగా ఉన్నామంటూ ప్రచారం గుప్పించిన కూటమి ప్రభుత్వం సాధారణ కార్డుదారులకు చక్కెర నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. గతంలో తుపాన్లు వచ్చిన సందర్భంలో సాధారణ కార్డుదారులకు అందజేసే సరుకుల్లో కోత పెట్టిన దాఖలాలు లేవని వినియోగదారులు అంటున్నారు. ఎంఎల్‌సీ పాయింట్ల నుంచి పూర్తిస్థాయిలో స్టాకు రాకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈనెల 15వ తేదీలోగా పంచదార రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తామని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు.
పంచదారకు కోత


