శోభాయమానం.. శ్రీవారి తెప్పోత్సవం
శ్రీనివాసా.. గోవిందా.. వేంకటరమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. సుదర్శన పుష్కరిణిలో ఉభయ దేవేరులతో హంసవాహనంపై శ్రీవారి విహారం నేత్రపర్వమైంది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. విద్యుద్దీప కాంతులు, బాణాసంచా కాల్పులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ వేడుక సాగింది. ముందుగా ఆలయంలో ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన రాజగోపురం, క్షేత్ర పురవీధుల మీదుగా వాహనం సుదర్శన పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడ హంస వాహన తెప్పలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం తెప్ప పుష్కరిణిలో విహరించింది. అర్చకులు పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, పెన్మత్స నరసింహరాజు, పోల్కంపల్లి అనిల్ పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
– ద్వారకాతిరుమల


