మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్‌ఆర్ పేట పార్క్ వద్ద నుంచి విజయ విహార్ సెంటర్, రైతు బజార్, శంకర మఠం, సుబ్బమ్మ దేవి స్కూలు, రమా మహల్ సెంటర్ మీదుగా ఈ బైక్ ర్యాలీ సాగింది. అనంతరం మున్సిపల్ వాటర్ సప్‌లై ఎస్‌ఆర్ 2 పాయింట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పీ. కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ. అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 12వ పీఆర్‌సీని ప్రకటించాలని, మధ్యంతర భృతి 30 శాతం చెల్లించాలని, కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అడ్డకర్ల లక్ష్మీ ఇందిర, కురెళ్ళ వరప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు బీ.నారాయణరావు, సీహెచ్.అప్పారావు, డీ. అప్పారావు, డీ.వేంకటేశ్వరరావు, కే.శ్రీనివాసరావు, బీ.దుర్గారావు, ఎస్‌కే.ఆలీ, పీ.దుర్గారావు, ఎస్.గౌరీ శంకర్, ఎన్.శ్రీనివాసరావు, జీ.రవి, కే.బాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


