హడలెత్తించిన పొగ
కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం సమీపంలోని పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ రైతు చేలో నుంచి వచ్చిన పొగ ప్రయాణికులను, సమీపంలోని రైతులను హడలెత్తించింది. జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని పవర్ గ్రిడ్ సమీపంలోని ఎదురుగా ఉన్న మేకల సత్యనారాయణకి చెందిన వ్యవసాయ భూమిలో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున దట్టంగా తెల్లని పొగ అలముకుంది. ఆ ప్రాంతంలో గ్యాస్ పైపులైను ఉందని, గ్యాస్ పైప్ లైన్ లీకు కావడం వల్లే పొగ పైకి వస్తోందని ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్.నాగరాజు వెంటనే డిప్యూటీ తహసీల్దారు వెంకటలక్ష్మి, రెవెన్యూ అధికారులను ఘటనా స్థలానికి పంపారు. సత్యనారాయణ తన పొలంలో ఉన్న మినప పంటను తగలబెట్టడం వల్ల పొగ దట్టంగా కమ్ముకుందని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


