లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలు
చింతలపూడి: లారీ ఢీకొని భార్యాభర్తలు గాయపడిన ఘటన చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలం, దొండపాటివారి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడిగడప రాజారావు, జ్యోతి వైద్యం నిమిత్తం చింతలపూడి ఆసుపత్రికి వచ్చి తిరిగి స్వగ్రామం వెళుతుండగా కామవరపుకోట వైపు నుంచి చింతలపూడి వస్తున్న పామాయిల్ లోడ్ లారీ రాంగ్ రూట్‌లో వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజారావు, జ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కె రమేష్ రెడ్డి ఘటనా స్ధలానికి చేరుకుని గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించారు. లారీ డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆపదలో రాని 108.. వైఎస్సార్ సీపీ నేత సాయం
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. అదే సమయంలో అటువైపు వెళుతున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్ రమేష్‌రెడ్డి స్పందించి స్థానికుల సహకారంతో తన వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.


