మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: కార్తీక మాసం మంగళవారం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి 108 ప్రదక్షణలు చేసి, స్వామిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ.4,05,550 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో సుమారు 7,300 భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు.
ఉంగుటూరు: కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వెదురు పావులూరి జీవమణి (33) సోమవారం రాత్రి సమయంలో పురుగుమందు తాగి అనంతరం గ్రామ ఊరచెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీహరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవమణి కడుపునొప్పి తాళలేక చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీవమణి తల్లి నూజివీటి అనుసూయ ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం: కంపెనీలో పనిచేసి అదే కంపెనీ పేరు వచ్చేలా నకిలీ కంపెనీ పెట్టి కొందరిని మోసం చేసిన నేరంపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ చెప్పారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వంకాయల సతీష్, పట్టణానికి చెందిన మండపాక వినోద్‌కుమార్‌లను అరెస్టు చేశామన్నారు. వివరాల ప్రకారం.. బొమ్మగాని బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉన్న ఐఎఫ్‌ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్ధలో కొంతకాలం వీరంకి శ్రీరాములు, వంకాల సతీష్, మండపాక వినోద్‌కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చి అదే పేరు వచ్చేలా ఇనాకుల ఫార్మర్స్ లైఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఐఎఫ్‌ఎల్) పేరుతో మరో కంపెనీ ప్రారంభించి బాలకృష్ణ కంపెనీకి చెందిన ఖాతాదారులను, రైతులను మభ్యపెట్టి మోసం చేశారని బాలకృష్ణ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వీరంకి శ్రీరాములను అరెస్టు చేయగా, అతను హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందినట్లు ఎస్సై చెప్పారు. కాగా ఈ కేసులో వంకాయల సతీష్, మండపాక వినోద్‌కుమార్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు.
మద్ది క్షేత్రంలో విశేష పూజలు


