గుంతల రోడ్లపై పెల్లుబికిన ప్రజాగ్రహం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గుంతల రోడ్లపై ప్రజాగ్రహం పెల్లుబికింది. రోడ్లకు మరమ్మతులు చేయలేరా అంటూ ఏలూరులోని వంగాయగూడెం ప్రాంత ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. మోంథా తుపాను ప్రభావంతో ఏలూరు నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఏలూరు నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన మార్గంగా ఉపయోగపడుతున్న వంగాయగూడెం – కేన్సర్ ఆసుపత్రి రోడ్డులో ప్రమాదకర గుంటలు ఏర్పడి, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, గత ఏడాది నుంచి రోడ్డు మరమ్మతులు చేపట్టకుండా వదిలివేయడంతో వర్షాలు మొదలైనప్పుడల్లా రహదారి మొత్తం బురద గుంటలుగా మారుతోంది. చిన్న వాహనాలు, టూ–వీలర్ ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైన అత్యవసర తరుణాల్లో కేన్సర్ ఆసుపత్రికి వెళ్లే రోగుల ప్రయాణం కూడా ప్రాణాంతకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగాయగూడెం మాత్రమే కాకుండా, ఏలూరులోని హనుమాన్ నగర్ నుంచి కొత్తూరు వెళ్తున్న కాలువ పక్క రోడ్డుతో పాటు అనేక కనెక్టింగ్ రోడ్లు కూడా ఇదే దుస్థితిలో ఉన్నాయని నివాసితులు వాపోయారు. పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేకపోయినా కనీసం గుంటలను కూడా పూడ్చలేరా అని ప్రజలు నిలదీస్తున్నారు. స్థానికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడంతో అటువైపు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు వారిని వారించి ధర్నా విరమించాలని సూచించినా వారు నిరాకరించారు. కొంతసేపు ధర్నా నిర్వహించిన అనంతరం అధికార యంత్రాంగం అంతా తుపాను విధుల్లో ఉన్నట్టు తెలుసుకుని తాత్కాలికంగా ధర్నాను విరమించారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం అధికారులు తమ సమస్య పరిష్కరించకుంటే రోజంతా ధర్నా చేస్తామని హెచ్చరించారు.


