కుదించిన బోగీలు.. ప్రయాణికుల అగచాట్లు
ఉంగుటూరు: ఒకప్పటి పాస్టు ప్యాసింజరు.. ప్రస్తుతం విజయవాడ మొము ఎక్సుప్రెస్‌గా నడుపుతున్న నం.17258 రైలులో బోగీలు తగ్గించేయడంతో రైల్వే ప్రయాణికులకు ప్రయాణం కష్టతరంగా మారింది. గతంలో ఈ రైలులో 13 బోగీలు ఉండగా ప్రస్తుతం వాటిని 7కి పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు నిలబడే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. బోగీలు తగ్గించేసి గోదావరి జిల్లాల ప్రజలపై రైల్వే శాఖ చిన్నచూపు చూస్తోందంటూ సర్వత్రా విమర్శిస్తున్నారు.
అనువైన రైలు.. సౌకర్యాలు లేవు
ఈ రైలు కాకినాడలో తెల్లారుజాము 4.10 గంటలకు బయలుదేరి ఉదయం 9 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరిగి కాకినాడకు చేరుకునేందుకు సాయంత్రం 6.15కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో అనువైన సమయంలో ఈ రైలు ప్రయాణం ఉండడంతో ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం వచ్చే రైలులో సామర్లకోట, రాజమండ్రిలోనే ఈ రైలులోని సీట్లు పుల్ అయిపోతుంటాయి. ఆతరువాత నుంచి రైలు ఎక్కిన ప్రయాణికులు నిలబడి ప్రయాణం సాగించాల్సిందే. అలాగే ఈ రైలులో మరుగుదొడ్లు కూడా రెండుకు మించి లేవు. దాంతో అవసరాలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి.
ఉద్యోగులకు సరైన సమయం
ఈ రైలు ఉదయం వేళ గోదావరి, కొవ్వూరు, పశివేదల నిడదవోలు, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పూళ్ల, భీమడోలు, ఏలూరు, పవరుపేట, నూజువీడు స్టేషన్‌లలో ఆగుతూ విజయవాడ చేరుతుంది. ఉద్యోగస్తులకు సరైన సమయం కావడంతో ఎక్కువగా సీజన్ టికెట్లు తీసుకుని ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. అలాగే మార్కెటు పనులమీద వెళ్లేవారికి, దైవక్షేత్రాలకు వెళ్లే వారికి ఈ రైలు చాలా అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ రైలు ద్వారా విజయవాడ చేరుకుని అక్కడ నుంచి మరో రైలు పట్టుకుని ప్రయాణం సాగిస్తుంటారు. ఇదే రైలు గుంటూరు కూడా వెళుతుంది. దాంతో ఎక్కువమంది ఈ రైలును ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి రైలులో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా బోగీలను ఇంకా తగ్గించేయడంపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణికుల బాధలు పట్టించేకునే రైల్వే అధికారులు గానీ, పార్లమెంటు సభ్యులు గాని ఎవరూ లేరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాస్టుప్యాసింజరుగా పిలుచుకునే మెము ఎక్స్‌ప్రెస్ రైలులో బోగీల కుదింపు
ప్రయాణికులకు తప్పని పాట్లు
గోదావరి జిల్లాలపై రైల్వే శాఖ చిన్నచూపు!
కుదించిన బోగీలు.. ప్రయాణికుల అగచాట్లు


