విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు వంగాయగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగాయగూడెం ప్రాంతానికి చెందిన వీ.జోజి (52) స్థానికంగా ఉన్న కేన్సర్ హాస్పిటల్‌లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్రెయినేజీలో చెత్త తొలగించేందుకు ఇనుప ఊచతో శుభ్రం చేస్తుండగా అదే సమయంలో పక్కనే ఉన్న నీటి మోటరుకు చెందిన విద్యుత్ వైరుకు ఇనుప ఊచ తగలటంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లు సెంట్రల్: చెట్టు కొమ్మలు నరుకుతున్న ఓ కూలీ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో జి కుమారస్వామి (26) కూలి పని చేసుకుంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున గ్రామంలో పెద్దిరాజు అనే వ్యక్తి ఇంటికి పని నిమిత్తం కుమారస్వామి, అతని స్నేహితుడు కలిసి వెళ్లారు. ఇంటి వద్ద పనిచేస్తుండగా ఓ చెట్టును కొట్టడానికి కుమారస్వామి చెట్టు పైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య ప్రశాంతి ఫిర్యాదు మేరకు ఎస్సై బి సురేంద్రకుమార్ కేసు నమోదు చేశారు.


