నిండు జీవితాల్లో విషాదం
● ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు
● ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరూ మృతి
భీమడోలు: సంసారంలో ఒడిదిడుకులను తట్టుకోలేక, అవమానభారంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందగా భర్త సుధాకర్ (29) బుధవారం వేకువజామున మృతి చెందాడు. భానుపూర్ణిమ మృతదేహానికి విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించారు. సుధాకర్ మృతదేహానికి గుంటూరు ఆసుపత్రిలో పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించి ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి బుధవారం సాయంత్రం తరలించారు. దీంతో భీమడోలు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
సంసారంలో కుదుపు
ఐదేళ్ల కితం గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. సుధాకర్ మంచి వ్యక్తిగా అందరితో కలివిడిగా ఉండేవాడు. గ్రామంలోని కటారి మోహన్ నాగ వెంకట సాయి అనే యువకుడు భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి అమ్మవారి కుంకుమను ఇచ్చి నమ్మబలికి ఈనెల 6న ఆమెను ఇంటి నుంచి తీసుకుని వెళ్లాడు. బాధితురాలిని విజయవాడ తీసుకుని వెళ్లగా చనిపోతానని, ఇంటికి తీసుకు వెళ్లమని గొడవ చేయగా ఈనెల 19న భీమడోలు తీసుకువచ్చాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర అవమానభారంతో బాధపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధాకర్ తన భార్యను వదులుకోలేక తీవ్ర వేదనకు గురయ్యాడు. తాను మానసిక వేదనకు గురయ్యాయని, నా జీవితాన్ని నాశనం చేశాడని, మోహన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాల్లో పంపి ఈనెల 25న రాత్రి కూల్‌డ్రింక్‌లో కలుపు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు ఆసుపత్రిలో చిక్సి పొందుతున్న ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కరోజు గడువులో కన్నుమూశారు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకటసాయిను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.


