జీఎస్టీ జాయింట్ కమిషనర్ తీరుపై నిరసన
ఏలూరు టౌన్: సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వాణిజ్య పన్నుల శాఖలో సిబ్బంది పట్ల ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందని.. ఆధునిక యుగంలోనూ కిందిస్థాయి సిబ్బంది పట్ల అంటరానితనం ప్రదర్శిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు వన్‌టౌన్ జీఎస్టీ కార్యాలయం వద్ద వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నేతలు, సిబ్బంది నిరసన ప్రదర్శన చేశారు. చిత్తూరులో వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్‌టీ) జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్‌రెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అటెండర్ల పట్ల చులకన భావనతో చూడటంతో పాటు తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ సిబ్బంది మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కే.చిట్టిబాబు తెలిపారు. తన ముందు చెప్పులు వేసుకుని రాకూడదంటూ చెప్పటం అతని అహంకారానికి నిదర్శనం అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఏలూరులోనూ విధులను బహిష్కరించి నిరసన తెలిపామన్నారు. జాయింట్ సెక్రటరీ జీ.జాన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా నిరసన తెలిపుతున్నామని, వెంటనే అధికారిని బదిలీ చేయటంతోపాటు, మరోసారి కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.


