రైతులకు తక్షణ సాయం అందించాలి
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు
పెనుమంట్ర: తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న వరి, అరటి రైతులకు తక్షణ సాయం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు శ్రీ రంగనాథరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఆచంట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి పెనుమంట్ర మండలంలోని నత్తా రామేశ్వరం, గరువు, మాముడూరు, పాలమూరు, పెనుమంట్ర, బట్టలమగుటూరు, ఆలమూరు, వెలగలేరు, మార్టేరు గ్రామాల్లో తుపాను కారణంగా నేలకొరిగిన వరి చేలను, అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు అత్యవసర సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. నీట మునిగిన పంట పొలాలలో మురుగు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసు కోవాలని పంట, మురుగు కాలువల్లో పూడికతీత పనుల చేపట్టాలని కోరారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆదుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్సీపీ ఎప్పుడు ముందుందని రైతుకు ఏ కష్టం వచ్చినా తమ వంతు సహకారం అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్, గ్రామ సర్పంచ్ గూడూరు దేవేంద్రుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వాసంశెట్టి కిరణ్, గ్రామ సర్పంచులు బుర్రా రవికుమార్, ముదునూరి నాగరాజు, తాడిపర్తి ప్రియాంక తదితరులున్నారు.
బాధితులకు అండగా ఉండాలి
భీమవరం అర్బన్: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ భీమవరం నియోజవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయుడు కోరారు. మండలంలోని కొత్త పూసలమర్రు, దొంగపిండి తుపాను పునరావాస కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన కొన్ని ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రానికి వెళ్లి ఏర్పాట్లపై ఆరా తీశారు. బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. దొంగపిండిలో పునరావాస కేంద్రం వెళ్లి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామస్తులు కలుసుకుని గ్రామ సమస్యల కోసం ఆరా తీశారు.
రైతులకు తక్షణ సాయం అందించాలి


