రైతులను నట్టేట ముంచిన బాబు
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
పెంటపాడు: గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా రైతులను నట్టేట ముంచారని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన తుపాను బాధిత ప్రాంతాలైన అలంపురం, కొండేపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల రైతులను పరామర్శించి వారితో మాట్లాడారు. పలు ప్రాంతాలలో దెబ్బతిన్న పంటను పరిశీలించారు. తపాను వల్ల రైతులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినా ప్రభుత్వం స్పందించక పోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికే రూ.వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని.. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రకటన చేయాల్సి ఉండగా చర్యలు కానరావడం లేదన్నారు. రైతులంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతుల పట్ల ప్రేమ చూపలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, బీమా పరిహరం కూడా సరిగా అందలేదని, ఈ క్రాప్ చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతులకు వ్యవసాయం పండగ చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొట్టు నాగేంద్ర, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి సంపత్‌కుమార్, గోరింట రవివర్మ, సూర్యనారాయణరాజు, గుండుమోగుల సాంబయ్య, మర్రే కృష్ణమూర్తి, పంపన రాంబాబు పాల్లన్నారు.
ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలి
తాడేపల్లిగూడెం రూరల్: నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు, మారంపల్లి, కృష్ణాయపాలెం గ్రామాల్లో నేలనంటిన వరి చేలను బుధవారం ఆయన స్వయంగా పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.10 వేలు ఇన్‌ఫుట్ సబ్సిడీతో పాటు గత ప్రభుత్వం మాదిరిగా బీమా అందించాలని డిమాండ్ చేశారు.


