ఆత్మహత్యాయత్నం ఘటనలో భార్య మృతి
భీమడోలు: తీవ్ర మనోవేదన, అవమానాన్ని భరించలేక కలుపు మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందింది. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. వివరాల ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ దంపతులు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. గ్రామానికి చెందిన కటారి మోహన్ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి ఆమెను 15 రోజుల పాటు గ్రామాంతరం తీసుకుని వెళ్లాడు. ఆమె తనను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లాలని గొడవ చేయడంతో ఈనెల 19వ తేదీన భీమడోలు తీసుకుని వచ్చాడు. అయితే తీవ్ర మనోవేదన, అవమానాన్ని తట్టుకోలేక ఈనెల 25వ తేదీ రాత్రి భీమడోలు సమీపంలోని ఓ పశువుల పాకలో భార్యాభర్తలు సుధాకర్, భానుపూర్ణిమ కూల్‌డ్రింక్‌లో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుపూర్ణిమ మృతి చెందింది. భర్త సుధాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఏఎస్సై చలపతిరావు, వీఆర్వో సింహాచలం సమక్షంలో మృతురాలి మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. భానుపూర్ణిమ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త పరిస్థితి విషమం
ఆత్మహత్యాయత్నం ఘటనలో భార్య మృతి


